Pawan and Jagan combo |Mana Aksharam

ఇదీ పవన్ కళ్యాణ్ సత్తా… జగనే చెప్పారు!

జనసేన పార్టీతో పొత్తు కోసం ఏపీలోని అధికార, విపక్షాలు వెంపర్లాడుతున్నాయా? పవన్ కళ్యాణ్‌ను కలుపుకొని మరోసారి అధికారంలోకి వద్దామని తెలుగుదేశం, ఈసారైనా గెలుద్దామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు చేస్తోందా? అంటే కొట్టి పారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో లోపల జరిగేది ఒకటి, పైన జరిగేది మరొకటిగా ఉంటుంది. తాము పార్టీ మారడం లేదని చెప్పేవారే, రెండు రోజుల్లో పార్టీ మారిన సందర్భాలు ఉన్నాయి. తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదని చెప్పే పార్టీలు.. ఆ తర్వాత ఎప్పుడైనా కలువొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీలు కూడా జనసేనతో పొత్తు కోసం ఆరాటపడుతున్నాయనే వాదనలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్‌తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ బాహాటంగానే సిద్ధమన్నట్లుగా మాట్లాడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు కూడా తమతో కలిసి రావాలని చెప్పారు. కానీ వారితో కలిసేందుకు పవన్ నో చెప్పారు. తాను అధికార (టీడీపీ), ప్రతిపక్ష (వైసీపీ)లతో కలిసేది లేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు వామపక్షాలతో కలుస్తానని తేల్చి చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. టీడీపీ బాహాటంగానే ఆహ్వానిస్తోంది. కానీ పవన్ ఇటీవల వైసీపీని ఉద్దేశించి, ఆ పార్టీ తెరవెనుక తమతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో పొత్తు కోసం టీడీపీతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నాలు చేయడమే మన బలానికి నిదర్శనమని చెప్పారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కీలకం కానుంది. సాధారణంగా ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉంటుంది. జగన్, పవన్ కళ్యాణ్ లెక్కల్లో.. ఇప్పుడు ప్రభుత్వ ఓటు బ్యాంక్ ముఖ్యం. ఇప్పుడు జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీతో పాటు జనసేనకు కూడా వెళ్తుందని వైసీపీ నేతలు భావిస్తుండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేతపై ఉన్న అవినీతి కేసులను టీడీపీ పదేపదే ప్రస్తావిస్తోంది. ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… జగన్ విషయంలో టీడీపీకి ఉన్న ఒకే ఆయుధం అవినీతి కేసులు అని చెప్పారు. అదే సమయంలో జనసేన పైన రాజకీయపరంగా ఎలాంటి ఆరోపణలు లేవనే వాదనలు కోకొల్లలు. ఇది జనసేనకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. పవన్ ఇలాగే దూసుకెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా జనసేన వైపు మరలుతుందనే ఆందోళన కూడా వైసీపీలో ఉందేమోననే చర్చ సాగుతోంది. దానికి తోడు టీడీపీ, వైసీపీలకు ధీటుగా కాకపోయినా ఆ స్థాయిలో జనసేన పుట్టగానే ఓటు బ్యాంక్ కలిగి ఉంది.

ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందేమోననే భయం వైసీపీలో ఉండవచ్చునని అంటున్నారు. అదే జనసేనతో కలిస్తే ఆ పార్టీ ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. అయితే జనసేనతో పొత్తు కోసం తాము ప్రయత్నాలు చేయలేదని, అసలు అలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్‌కే ఉందేమోనని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ పైలెక్కల కారణంగా వైసీపీ.. పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నాలు చేస్తుందనే వాదనను పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు.