kathanayakudu twitter review
kathanayakudu twitter review

కథానాయకుడు ట్విట్టర్ రివ్యూ

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యన్.టి.ఆర్’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ సినిమాలో బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్‌లు రాశారు. అలాగే ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల పాత్రల్లో పలువురు సినీ ప్రముఖులు కనిపించారు. ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. అందులో ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన భాగాన్ని ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ పేరుతో బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.

మంగళవారం రాత్రే పలు ప్రాంతాల్లో సినిమా విడుదలైంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఆరు షోలకు అనుమతి ఉండడంతో అక్కడ ఇప్పటికే బెన్‌ఫిట్‌ షోలు పడిపోయాయి. అంతేకాదు, హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో కూడా సినిమా ప్రదర్శితమైంది. ఈ సినిమా చూసిన చాలా మంది ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ట్వీట్లను బట్టి చూస్తే ఈ సినిమా నందమూరి అభిమానులకు సంక్రాతి కానుకగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. అలాగే సగటు సినీ అభిమానికి కూడా కనువిందు చేసే విధంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాపై ట్విట్టర్‌లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఈ విధంగా ఉంది.

ఈ సినిమాలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. తన తండ్రి పాత్రల్లో బాలయ్య కనిపించిన విధానం సినిమాకే హైలైట్ అని అంటున్నారు. సినిమాలోని చాలా సన్నివేశాల్లో బాలయ్య అచ్చం ఎన్టీఆర్‌లానే కనిపించారట. ఈ క్రెడిట్ మాత్రం దర్శకుడు క్రిష్‌కే దక్కుతుందంటున్నారు. సినిమాలోని దివిసీమ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని వివరిస్తున్నారు. అలాగే, సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగ్‌లు, కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయట. అయితే, ఫస్టాఫ్ కొంచెం సాగదీతగా అనిపించిందని, ఎన్టీఆర్ గెటెప్‌లు ఎక్కువైపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సినిమాతో బాలయ్య మరో సంక్రాంతి విజయాన్ని దక్కించుకున్నాడని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.