Mana Aksharam
  • Home
  • News
  • ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండండి : సిఎం చంద్రబాబు
Breaking Editorial Headlines Homepage-Slider News Top Read Stories

ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండండి : సిఎం చంద్రబాబు

ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండండి : సిఎం చంద్రబాబు

‘ ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండండని ‘ మోడీ సర్కార్‌ ని సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో హెచ్చరించారు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు. ముందుగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధికి సిఎం నివాళులర్పించారు. సిఎం తో పాటు మంత్రులు, ఎంపి లు, పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సిఎం చంద్రబాబు దీక్షా స్థలికి బయలుదేరి ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు. ఎపి భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి సిఎం నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేద్కర్‌, ఎన్‌టిఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. ఎపి కి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయనందుకు.. నిరసనగా ఈ దీక్ష చేపట్టారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో ఎపి సిఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎన్‌జిఒ, ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. నల్ల చొక్కాలతో నిరసన తెలుపుతూ.. టిడిపి నేతలు దీక్షా స్థలికి తరలివచ్చారు. ప్రత్యేక హోదా నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది. చంద్రబాబు దీక్షకు 23 పార్టీల నేతలు సంఘీభావం తెలుపనున్నారు. ఎన్‌డిఎ మధ్యంతర బడ్జెట్‌లోనూ ఎపి కి మొండిచెయ్యి చూపడంతో.. సిఎం ఈ సారి ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించారు.

ఈ దీక్షకు ఎపి నుంచి వేలాది మంది ప్రజలు, ప్రజా ప్రతినిధులతో పాటు పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి.
అనంతరం ఎంపి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విభజన హామీల అమలు కోసమే ధర్మ పోరాట దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు చాలా మంది నేతలు వస్తున్నారని అన్నారు. దేశంలో ఎపి భాగం కాదన్నట్టు..కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు. ఎపి కి రావాల్సిన హక్కులనే కోరుతున్నామని తెలిపారు. ప్రధాని మోడీ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఎంపి సుజనా చౌదరి మండిపడ్డారు. ఈ సందర్భంగా.. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఎంపి అశోక్‌ గజపతిరాజు పిలుపునిచ్చారు.
ఎంపి గల్లా జయదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఎపి కి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మోడీ పిఎం కాలేరని, మోడీని గద్దె దింపాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఈ దీక్షకు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం తెలుపనున్నారని గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.


ధర్మ పోరాట దీక్షలో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే ఆంధ్ర భవన్‌ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు ప్రారంభించామని.. అవన్నీ జయప్రదం అయ్యాయని, ఈనాటి ధర్మ పోరాట దీక్ష కూడా విజయవంతమవుతుందన్నారు. తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజల మనోభావాలకు సంబంధించిందని.. ‘ ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండండని ‘ మోడీ సర్కార్‌ ని హెచ్చరించారు. హక్కుల కోసమే పోరాడుతున్నామని… భిక్ష కోసం కాదని చెప్పారు. వివక్ష చూపిస్తే.. ఆటలు సాగవని చెప్పడానికి.. గుర్తు చేయడానికే ఢిల్లీకి వచ్చామన్నారు. పాలకులు ధర్మాన్ని మర్చిపోయినప్పుడు.. గుర్తు చేయాల్సిన బాధ్యత జనంపై ఉంటుందని సిఎం పేర్కొన్నారు. గోద్రా ఘటన జరిగినప్పుడు .. ధర్మాన్ని పాటించాల్సిన వ్యక్తులు పాటించలేదంటూ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. లెక్కలు చెప్పడానికి తాము సిద్ధమని.. తాము కట్టిన పన్నులు చెప్పడానికి మోడీ సర్కార్‌ సిద్ధమా అని సిఎం చంద్రబాబు ప్రశ్నించారు

Related posts

ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో న్యాయ పోరాటం!

admin

రంగంలోకి బాలయ్య

Masteradmin

దినకరన్‌ దొరికేశాడు!

Masteradmin