Home / News / Andhra / చంద్రబాబుకు పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్

చంద్రబాబుకు పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్

టీడీపీ గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తోందని, అందుకే ప్రధాని మోడీ తన సభలో అన్ని విషయాలను చెప్పారని పురంధేశ్వరి గుర్తు చేశారు. మోడీ సభ ద్వారా వివరణ ఇచ్చారని చెప్పారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందా, పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేయలేదా, నిధులు అన్నీ కేంద్రానివి కావా, సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా అమలు కావడం లేదా.. వీటన్నింటిపై ఏపీ ప్రజలు ఒక్కసారి గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే అవుతోందన్నారు.

ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని టీడీపీ చెబుతోందని అనగా పురంధేశ్వరి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు వ్యక్తిగత విమర్శలు ఎక్కడ చేశారని ప్రశ్నించారు. నాకు అర్థం కావడం లేదని, మోడీ… చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు ఏం చేశారో చెప్పాలన్నారు. అమరావతి నుంచి పోలవరం వరకు అవినీతి జరిగిందని చెప్పారని, అది నిజమేనని అంతకుమించి మాట్లాడలేదన్నారు. ఏం మాట్లాడారో (వ్యక్తిగత విమర్శలు) మీడియా చెప్పినా లేదా వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించిన వారు (చంద్రబాబు) చెప్పినా మేం సమాధానం చెబుతామన్నారు. భార్యను విడిచి పారిపోయావని, మీకు కుటుంబం లేదని మోడీ ఏమీ విమర్శించలేదన్నారు. మోడీకి యావత్ భారతదేశమే కుటుంబం అన్నారు. ఆయనకు ఏదైనా బంధం, అనుబంధం, సంబంధం ఉందా అంటే అది భారతదేశంతో అన్నారు. ఆయనకు కుటుంబం ఎక్కడ లేకుండా ఉందని చెప్పారు. అలాంటి వ్యక్తిగత విమర్శలకు మోడీ దిగజారలేదని, కానీ ఏపీలో జరిగిన అవినీతిని ప్రశ్నించారన్నారు.