majjiga pulusu with chicken
majjiga pulusu with chicken

చికెన్ మజ్జిగ పులుసు తయారీ..!!

మజ్జిగ పులుసు అంటే పల్లెటూళ్లు మొదలు పట్టణాల వరకు అందరికీ తెలిసిన వంటకమే! ముద్దపప్పు – మజ్జిగ పులుసు కాంబినేషన్‌ తెలియని తెలుగువారుండరు. ఇది శాకాహారుల వరకు బాగానే ఉన్నా మాంసాహార ప్రియులకు కొంచెం వెలితిగా ఉండేది. ఆ లోటును కూడా ఇప్పుడు పాకశాస్త్ర ప్రవీణులు చికెన్‌ మజ్జిగ పులుసుతో తీర్చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడిది ప్రత్యేకమైన వంట. విందువినోదాల్లో, శుభకార్యాల్లో చికెన్‌ మజ్జిగపులుసు ఘుమఘుమలాడుతోంది..

కావలసినవి: పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తాలింపు కోసం జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, చికెన్‌, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు.

తయారీ ఇలా: అల్లం, వెల్లుల్లిని ముద్దగా దంచి.. సిద్ధం చేసుకున్న చికెన్‌ ముక్కలకు పట్టించాలి. దీన్ని కుక్కర్‌లో కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్‌ వేసేంత వరకు ఉడికించాలి. బాణలిలో తగినంత నూనె పోసి ఉడికించిన చికెన్‌ను దోరగా వేయించాలి. ఈ చికెన్‌కి ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా, కొత్తిమీర చల్లి మరికొంత సేపు పొయ్యిపై ఉంచాలి. దాంతో చికెన్‌ ఫ్రై సిద్ధమవుతుంది. ఇది పక్కన పెట్టుకుని మజ్జిగ పులుసు తయారు చేసుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనెపోసి పచ్చిమిర్చి, అల్లం వేయించి పళ్లెంలోకి తీసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. తర్వాత కొద్దిగా నూనె పోసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు చేర్చిన పెరుగును పోపులున్న బాణలిలో వేసుకోవాలి. రుబ్బిన పచ్చిమిర్చి పేస్టును కూడా పెరుగులో కలపాలి. దీనిలో కావాలంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవచ్చు. ఇలా తయారైన మజ్జిగ పులుసులో చికెన్‌ ఫ్రైను కలిపి కొంతసేపు ఉంచితే చికెన్‌ మజ్జిగ పులుసు సిద్ధమవుతుంది.