chat with sweet potato
chat with sweet potato

చిలగడ దుంపలతో చాట్..!!

చిలగడదుంపల్ని చాలామంది ఉడకబెట్టుకుని తింటారు. కొందరు బెల్లం పాకంలో వేస్తారు. ఈ రెండూ కాకుండా ఉత్తరాదిన వీటితో రుచికరమైన చాట్‌ కూడా తయారుచేస్తారు. అదెలా చేయాలో చూద్దాం.. ఈ చాట్‌ చేసుకోవడానికి నాలుగు తాజా చిలగడదుంపలు, ఐదుచెంచాలు కరిగించిన బటర్‌ తీసుకోవాలి. అలాగే పుదీనా చట్నీ, స్వీట్‌చట్నీ, కమ్మని పెరుగు కూడా కావాల్సి ఉంటుంది. ముందుగా చిలగడ దుంపల్ని ఉప్పు వేసిన నీళ్లలో మరీ మెత్తగా కాకుండా పదనుమీద ఉడికించుకోవాలి. వీటిని చక్కగా క్యూబ్స్‌లా సమానంగా తరిగి పెట్టుకోవాలి. వీటిని తీసుకుని స్కూయర్స్‌… అంటే కబాబ్‌లు కాల్చుకోవడానికి వీలుగా ఉండే వెదురు పుల్లలు లేదా సన్నపాటి ఊసల్లాంటివి… వీటికి దుంప ముక్కల్ని గుచ్చి గ్యాస్‌మీద కానీ, బొగ్గులమీద కానీ కాల్చుకోవాలి. టిష్యూ పేపర్‌తో తుడిస్తే పైన పొట్టు వచ్చేస్తుంది. వీటికి అన్నివైపులా బటర్‌ రాసి వాటిని ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. దీనిపై రెండు నుంచి మూడు చెంచాల పుదీనాచట్నీ, ఆపై కొద్దిగా పెరుగు, చెంచాన్నర స్వీట్‌చట్నీ వేసి చివరిగా నల్లఉప్పు, కారం, వేయించిన జీలకర్రపొడి వేసుకుంటే చాట్‌ సిద్ధం అవుతుంది. చివరిగా పుదీనా ఆకులతో అలంకరించుకుంటే సరి.

పుదీనా చట్నీ లేదా గ్రీన్‌ చట్నీ తయారీ:  ఒక కట్ట పుదీనాకి రెండు కట్టల కొత్తిమీర తీసుకోవాలి. ముందుగా రెండు రెబ్బల వెల్లుల్లిపాయలు, రెండు పచ్చి మిరపకాయలు, చిన్నఅల్లం ముక్క, చెంచా నిమ్మరసం, కొద్దిగా పంచదార, తగినంత ఉప్పు, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. వీటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, ఉప్పు కూడా వేసుకుని రుబ్బితే గ్రీన్‌చట్నీ రెడీ. కొంతమంది మంచి రంగు కోసం పెరుగు కూడా కలుపుతారు.

స్వీట్‌ చట్నీ: కప్పు ఖర్జూరాలు, రెండు చెంచాలు చింతపండు గుజ్జు, అరకప్పు బెల్లం తీసుకుని వీటిని తగినన్ని నీళ్లలో ఉడికించుకోవాలి. మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. దానిలో ఇంగువ, కారం, ఉప్పు కూడా వేసుకుంటే స్వీట్‌ చట్నీ సిద్ధం. దీనిని చాట్‌, రగడా, బేల్‌పూరీ, దహీపూరీలో వేసుకుంటే బాగుంటుంది.