Mana Aksharam
  • Home
  • Entertainment
  • నాటకాలొద్దు.. ఎన్టీఆర్‌కి భారతరత్న అడ్డుకుంది బాబే: తమ్మారెడ్డి
Cinema Entertainment Homepage-Slider

నాటకాలొద్దు.. ఎన్టీఆర్‌కి భారతరత్న అడ్డుకుంది బాబే: తమ్మారెడ్డి

ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలంటూ ఆయన్ని అభిమానించే అభిమానులు.. తెలుగుదేశం కార్యకర్తలు.. ఆ పార్టీ నాయకులు గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌కి భారతరత్న విషయంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్రం సీతకన్ను వేసింది. అయితే అసలు ఎన్టీఆర్‌కి భారతరత్న రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబేనంటూ బాంబ్ పేల్చారు దర్శక నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ.  నా ఆలోచన అనే యూ ట్యూబ్ ఛానల్‌లో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘ఇటీవల రిపబ్లిక్ డే వచ్చింది.. కేంద్రం ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పద్మ అవార్డులను ఇచ్చారు. అయితే 15, 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. ఎన్టీరామారావు గారు చనిపోయి 22 ఏళ్లు అయ్యింది. ఆయన చనిపోయిన దగ్గరనుండి ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో తెలియదు. 

అయితే ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్ మెంట్ చూశా.. ‘ఎన్టీఆర్‌కి భారతరత్న ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు’ అంటూ పేపర్‌లో చూశా. అయితే చంద్రబాబుపై నేను కామెంట్ చేయడం కాదు కాని.. నా వచ్చిన అనుమానం చెబుతున్నా. చంద్రబాబు చాలాసార్లు చెప్పారు.. నాకు ప్రధాని పదవి వస్తే వదిలేశాను. మొత్తం భారతదేశాన్ని నేనే నడిపించాను. చక్రం తిప్పాను అంటూ చెప్పుకొచ్చారు. నిజంగా కేంద్రంలో చక్రం తిప్పగల చంద్రబాబు తలచుకుంటే.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అనుకుంటే ఇవ్వలేకపోయేవారా? మొన్నటి వరకూ నాలుగున్నరేళ్ల పాటు బీజీపీ పార్టీతో సన్నిహితంగా ఉన్నారు. ఆయన అడిగితే కేంద్రం కాదనేదా? ఇదంతా చూస్తుంటే నాకు ఇదో స్టోరీలాగ కనిపిస్తుంది. అవార్డులు ప్రకటించేవరకూ సైలెంట్‌గా ఉండి.. ప్రకటించిన తరువాత స్టేట్ మెంట్ ఇవ్వడం చూస్తే నాకు నిజంగా వచ్చిన అనుమానం ఏంటంటే… ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే.. కుటుంబం మొత్తం వెళ్లాలి. కాని.. భార్యగా ఉన్న లక్ష్మీపార్వతి ఆ అవార్డును తీసుకోవాలి. ఎందుకంటే భార్య కాబట్టి. ఆవిడ భారతరత్న తీసుకుంటే వీళ్లకు ఇష్టం లేదు కాబట్టే వీళ్లే ఎన్టీఆర్ భారతరత్నను ఆపుతున్నారనే అనుమానం నాకైతే ఉంది.

అయితే మనకు భారతరత్న అక్కర్లేదు అంటే వదిలేసేయాలి. అంతేతప్ప ఈ స్టేట్‌మెంట్‌లు ఇవ్వకుండా ఉంటే బావుంటుంది. ప్రతిసారి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వలేదు.. ఇవ్వలేదు అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చిన తరువాత ఆయన గురించి తెలిసిన వాళ్లు తెలియని వాళ్లు ఎన్టీఆర్ గురించి చాలా చెడుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ గొడవ కాకుండా మళ్లీ భారతరత్న గొడవ అవసరమా చెప్పండి. ఆయన దేశానికి, రాష్ట్రానికి, సినిమా ఇండస్ట్రీకి చాలా చేశారు. భారతదేశంలోనే అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంత చరిత్రకారుడిలో మైనస్‌లు ఉన్నాయో లేదు ఎవరికీ తెలియదు. కాని 22 సంవత్సరాల తరువాత ఆయన గురించి నెగిటివ్‌గా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు. ఆయన గౌరవం కాపాల్సిన బాధ్యత అందరిపై ఉందనేది నా ఫీలింగ్’. దయచేసి మీరందరూ నాటకాలు ఆడకండి. ఆయన పేరు మీదే ఈరోజు చాలా మంది బతుకుతున్నారు. అసలు ఎన్టీఆర్ లేకపోతే తెలుగుదేశం లేదు.. ఆయనే లేకపోతే ఈరోజు రాష్ట్రాన్ని ఏలే అవకాశమే లేదు. మీరందరూ కలసి ఆయన్ని భ్రష్టుపట్టించకుండా ఉంటే చాలా మంచిది’ అంటూ ఎన్టీఆర్ భారతరత్న‌పై నాటకాలు ఆడేవాళ్లకు డైరెక్ట్‌గానే క్లాస్ పీకారు తమ్మారెడ్డి భరద్వాజ. 

Related posts

డీఎస్సీపై అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం!

admin

మాకు మీ ఆశీర్వాదం కావాలి!

Masteradmin

త్రిషకు గోల్డెన్ ఛాన్స్..

admin