అనంతపురం సమర శంఖారావం లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి మాటల్లో… మన పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లోమీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఇలా అనేక చానళ్లతో పోరాటం చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైయస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ల ఓట్లు తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేవుడి ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో, ప్రజల ఆశీసులతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలి. కులం చూడొద్దు, మతం చూడొద్దు. ప్రాంతం, వర్గం చూడొద్దు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన ప్రతి పేదవాడికి అందాలి. ఈ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించేది మీరే. ఎన్నికలు దగ్గరపడ్డాయి. ఈ నెలాఖరులో షెడ్యుల్ వస్తుందంటున్నారు. ఆ తరువాత నెల, నెలన్నరలో ఎన్నికలు జరగబోతాయి. అంటే ఈ రోజు నుంచి దాదాపు మూడు నెలల లోపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో మీ అందరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉంది.
మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. అన్యాయానికి ప్రతిరూపంగా ఉన్న వారితో యుద్ధం చేస్తున్నాం. మోసగాళ్లతో పోరాడుతున్నామని ఎవరూ మర్చిపోలేదు. ఎన్నికలు వచ్చే సరికి ఓటర్ లిస్టులో పేర్ల తొలగింపు కార్యక్రమాలు జరగుతున్నాయి. వైయస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమం చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. ఓటర్ లిస్టును మీరంతా సరిచేసుకోవాలి. ప్రతి గ్రామంలో మన మీద అభిమానం చూపించే వారంతా ఓటర్లుగా ఉన్నారా లేరా అని మరోసారి చూసుకోండి. ఓటర్లుగా మన పేర్లు తొలగించిన పరిస్థితి ఉంటే ఫామ్–6ను నింపి వారిని జాబితాలో చేర్చే విధంగా చూడాలి.
రాష్ట్రంలో అక్షరాల 59.18 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని గమనించాలి. ఆ బోగస్ ఓట్లలో తెలంగాణలో 20 లక్షలు ఉంటే.. మిగిలిన 39 లక్షలు మన రాష్ట్రంలోనే ఒకొక్కరికి రెండు ఓట్లు ఉన్నాయి. ఆ మొత్తం దొంగ ఓట్లను మనమంతా తొలగించే కార్యక్రమం చేయాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, మన పార్టీ మధ్య తేడా కేవలం 5 లక్షలు మాత్రమే మీరంతా మర్చిపోవద్దు. అందరూ అప్రమత్తంగా ఉండి. దొంగ ఓట్లు ఉన్న చోట ఓట్లు తొలగించే కార్యక్రమం చేయాలి. మన సానుభూతి పరుల ఓట్లను తొలగించి ఉంటే వాటిని నమోదు చేసే కార్యక్రమంలో ముందుండాలి.