srisailam latest news
srisailam latest news

శ్రీశైలంలో తాంత్రిక పూజలు..!

గతేడాది బెజవాడ కనకదుర్గ ఆలయం, పదిహేను రోజుల కిందట సింహాచల క్షేత్రపాలకుడు భైరవస్వామి ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై చెలరేగిన దుమారం ఇంకా సద్దుమణగనే లేదు. తాజాగా శ్రీశైలంలో తాంత్రిక హోమం నిర్వహించిన వ్యవహారం వెలుగు చూసింది. ఈ హోమాన్ని మల్లిఖార్జున స్వామి ఆలయం వేద పండితుడే నిర్వహించినట్టు తేలడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. తాంత్రిక హోమం చేశారన్న అభియోగంపై వేదపండితుడు గంటి రాధాకృష్ణను ఈవో శ్రీరామచంద్రమూర్తి మంగళవారం సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆయన.. దేవస్థానం అనుమతి లేకుండా తాంత్రిక హోమాలను నిర్వహించారనే సమాచారం మేరకు వేద పండితుడిని విధుల నుంచి తప్పించామని తెలిపారు. ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రసాద్‌రెడ్డి, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాధాకృష్ణపై సంబంధిత చర్యలు తీసుకున్నట్టు ఈవో వివరించారు. ఆస్థాన వేద పండితుడు గంటి రాధాకృష్ణ డిసెంబరు 22న తన నివాసంలో నిర్వహించిన హోమంపై పెను దుమారం రేగింది.
ఈ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 22న అర్ధరాత్రి 12 గంటల తర్వాత వేదపండితుడు గంటి రాధాకృష్ణ  తన నివాసంలో త్రికోణాకృతిలో హోమగుండం ఏర్పాటు చేసి హోమం నిర్వహించారన్నారు. ఈ వ్యవహారాన్ని ఆలయ ముఖ్యభద్రతాధికారి ప్రసాద్‌రెడ్డి తన తనిఖీల్లో గుర్తించారని తెలిపారు. అనంతరం సీఎస్‌వో, ఆగమ సలహామండలి సభ్యుల నివేదిక ప్రకారం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఈవో వెల్లడించారు. గతేడాది డిసెంబరు 26 అర్ధరాత్రి విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించిన వ్యవహారంపై రాజకీయంగా పెను ప్రకంపనలు రేపింది.