2019లో ప్రధాని అభ్యర్థిని మేమే నిర్ణయిస్తాం!

చంద్రబాబు బెంగళూరులో కర్ణాటక సీఎం కుమారస్వామి, దేవేగౌడ తదితరులతో సమావేశమయ్యారు. పద్మనాభనగర్‌లోని దేవేగౌడ నివాసంలో సమావేశమయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ముగ్గురు నేతలు కలిసి మీడియాతో మాట్లాడారు.

కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి స్వతంత్ర సంస్థలను బీజేపీ హరించి వేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని చాలా రాష్ట్రాలలోని ప్రతిపక్ష నేతలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. అన్ని రాజ్యాంగబద్ద సంస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు.

2019లో మూడో కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మాయావతి, అఖిలేష్ యాదవ్‌లతో చర్చించానని చెప్పారు. రేపు (శుక్రవారం) డీఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చిస్తానని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కలిసి పని చేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలంటే దేవేగౌడ లాంటి నేత సహకారం అవసరమని చెప్పారు.

నోట్ల రద్దు జరిగి ఇప్పటికీ రెండేళ్లయిందని, ఇప్పటికీ నోట్ల రద్దు కష్టాలు తీరలేదని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది మేం తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు.