సీఎం రమేష్ ఆధిపత్య పోరు?

మేము క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకునే తెలుగు తమ్ముళ్లు.. క్రమశిక్షణ తప్పుతున్నారా? వర్గ పోరుతో పార్టీ పరువు బజారున పడేస్తున్నారా? జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఆధిపత్య పోరుతో కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ నేతలు రోడ్డెక్కుతున్నారు. ఏకంగా 21 మంది కౌన్సిలర్లు రాజీనామాల వ‌ర‌కూ దారితీసింది వీరి వర్గపోరు.

ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుడిని బ‌రిలో దింపేందుకు వ‌ర‌ద‌రాజుల రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే సీఎం ర‌మేష్ ప్రొద్దుటూరు రాజ‌కీయాల్లో త‌ల‌దూర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ఇందులో భాగంగా.. వరదరాజులు రెడ్డి తనకు పోటీగా లేకుండా ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిని ప్రోత్సహించారు. ఈపరిస్థితుల్లో వరదరాజులు రెడ్డి సీఎం రమేష్ పై అనేక‌మార్లు మీడియా ముందుకొచ్చి ఫైరయ్యారు. మండల స్థాయికి ఎక్కువ‌..అసెంబ్లీకి త‌క్కువా అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి సమయం కోసం చూస్తున్న సీఎం రమేష్.. వరదరాజులు రెడ్డికి వ్యతిరేకంగా చక్రం తిప్పారు. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వ‌ర్గీయులు 21 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులు చేత రాజీనామా చేయించి సంచ‌ల‌నం రేపారు. వరదరాజుల రెడ్డి మున్సిపాలిటీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని… ఛైర్మన్‌ను అడ్డుపెట్టుకుని తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దింతో ప్రొద్దుటూరులో మరోమారు సీఎం రమేష్ వెర్సెస్ వరదరాజులు రెడ్డి గా రాజకీయ పరిస్థితి మారింది. చివరికి ఈ తతంగం అంత స్థానిక టీడీపీకి నష్టం చేకూరేలా ఉంది . మరి ఈ అంశం న్నీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు చక్కపెడతారో చూడాలి.