ఆఫీసుకి ఆకట్టుకునేలా అలంకరణ….

ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మన ఆహార్యం ఎంత హుందాగా ఉంటే.. అంత మంచిదంటారు. అలాగని సూట్లు వేసుకుని వెళ్లాలని లేదు. వేసుకునే దుస్తులతో పాటూ ఇతర అలంకరణ విషయంలోనూ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అదెలాగంటే…

మనం వేసుకునే దుస్తులు మనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాలి. అందుకే మరీ వదులుగా, మరీ బిగుతుగా ఉన్నవి ఎంచుకోకూడదు. కనీసం ఒక ఇంచు వదులుగా ఉండేలా చూసుకోవాలి. కార్యాలయానికి వేసుకునే దుస్తుల్ని అంతర్జాలంలో కాకుండా విడిగా దుకాణాలకు వెళ్లి కొనుక్కోవడమే మంచిదంటారు ఫ్యాషన్‌నిపుణులు. అప్పుడే మనకు నప్పాయో లేదో తెలుస్తుంది.

విధులకు వెళ్లేవారు వీలైనంతవరకూ ముదురు రంగులు ముఖ్యంగా నలుపూ, నీలం, ఆకుపచ్చ, గోధుమరంగుల్ని ఎక్కువగా ఎంచుకోవాలట. అలాగే సన్నని గీతలూ, అబ్‌స్ట్రాక్ట్‌ ప్రింట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. సంప్రదాయ దుస్తుల్ని ఎంచుకుంటుంటే రంగుల మేళవింపులో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు.

పాశ్చాత్య వస్త్రశ్రేణిని ఎంచుకునేవారు దానికి తగ్గట్లే హైహీల్స్‌ని ఎంచుకోవాలి. అయితే అవి మరీ ఎత్తులో కాకుండా సౌకర్యంగా ఉండే వెడ్జ్‌, కిటెన్‌ హీల్స్‌ తరహా రకాల్ని ఎంచుకోవాలి. అదే సంప్రదాయ దుస్తులయితే ఫ్లిప్‌ఫ్లాప్స్‌, బాలే, జ్యూతీల వంటివాటిని ఎంచుకుంటే హుందాగా కనిపించొచ్చు.

చెవులకు పెట్టుకునే దిద్దులు కూడా ఎంత చిన్నగా, సాదాగా ఉంటేనే అంత మంచిది. వీలైనంతవరకూ స్టడ్స్‌ లేదా బిందువు ఆకారంలో ఉన్నవాటిని పెట్టుకోవాలి. ఇక కాస్త ప్రత్యేకంగా కనిపించాలనుకున్నప్పుడు ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ నగలు బాగుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*