సమాజానికి ఎదురుతిరిగి హెచ్‌ఐవీ బాధితులకు బాసటగా కౌసల్య..

తమిళనాడు రాష్ట్రంలోని నమ్మక్కళ్ జిల్లాకు చెందిన కౌసల్యది దీనత్వంలోంచి వచ్చిన చైతన్య గాథ. అది 1995వ సంవత్సరం.. 19వ ఏట అడుగుపెట్టిన కౌలస్యకు తమ బంధువైన పెరియస్వామితో పెండ్లి చేసి తమ బాధ్యత తీర్చుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అయితే అతడు పెండ్లికి ముందే హెచ్‌ఐవీ బాధితుడు. ఈ విషయం తెలిసినా భర్త, అతని తల్లిదండ్రులు కౌలస్యకు చెప్పకుండా మోసం చేశారు. పళ్లై నెల రోజులు గడువకముందే అనారోగ్యం పాలైంది కౌలస్య. ఆస్పత్రికి వెళితే హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. తాను చేయని తప్పుకు ఈ శిక్షేంటని వైద్యులను నిలదీయడంతో.. నీ భర్త నుంచి సోకిందని చెప్పారు. గుండె నిండా దుఃఖం, పట్టలేని ఆగ్రహంతో భర్త, బంధువుల పోలీసు కేసు పెట్టింది. అనారోగ్యం బాధపెడుతున్నా, సమాజం చీదరిస్తున్నా కుంగిపోలేదు.

తనలాగే మోసపోతున్న అమాయక మహిళల్లో చైతన్యం తీసుకురావాలని దృఢంగా నిశ్చయించుకున్నది. తనలాంటి నలుగురి బాధితులతో 1998లో పాజిటివ్ ఉమెన్ నెట్‌వర్క్ అనే సంస్థను స్థాపించింది. అలా తమిళనాడు నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దేశంలోని దాదాపు13 రాష్ర్టాల్లో తిరిగి.. ఆయా స్వచ్ఛంద సంస్థల ద్వారా హెచ్‌ఐవీ బాధితులల్లో చైతన్యం నింపింది. పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. బాధితుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. బాధితుల పిల్లలకు ఉచిత విద్యను చెప్పిస్తున్నది.

ప్రస్తుతం 30వేల మందికి పైగా హెచ్‌ఐవీ బాధితులను కూడగట్టి వారికి వైద్యం అదించేందుకు కృషి చేస్తున్నది. అంతేకాకుండా బాధితులకు పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యాగాలు ఇప్పించేందుకు కౌలస్య ఆధ్వర్యంలోని పీడబ్ల్యూఎన్ సంస్థ కృషి చేస్తున్నది. కౌలస్య రగిలించిన స్ఫూర్తిలో పలు కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రులు బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ కర్టెసీ) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*