వైసీపీలో కాపు -రెడ్డి వర్గాల అంతర్గతపోరు!!

రాజకీయపార్టీల్లో అంతర్గత విబేధాలు, ఆదిపత్యపోరు మామూలే.. కాని ఆ పార్టీలో మాత్రం కొత్త ట్రెండ్‌ షురూ అయింది. సామాజిక వర్గాల పోరుతో ఏపీలో వైసీపీ సతమతం అవుతోంది.ఎన్నికలు దగ్గర పడుతున్నసమయంలో వైసీపీలో సమాజికవర్గాల పోరు ముదురుతోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అధినాయకత్వం.. ఆ దిశగా ప్రయత్నంచడంలేదని పార్టీక్యాడర్‌ అసంతృత్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో మెజారిటీ కాపు సామాజిక వర్గం టీడీపీకి అండగా నిలిచారు. దింతో వైసీపీ అధికారపీఠానికి దూరం అయిందనే వాదనలు అప్పట్లోనే వచ్చాయి. తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపునేతలను జగన్ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గ స్థాయిలో మాత్రం కాపు నేతలని కాదని రెడ్డివర్గం నేతలకు వైసీపీ ప్రాధాన్యం ఇస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.

విజయవాడ పాలిటిక్స్‌లో బలమైన నాయకుడిగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం ఇపుడు జోరుగా సాగుతోంది.గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజవర్గం నుంచి తనకు రావాల్సిన పార్టీ టిక్కెట్‌ గౌతంరెడ్డికి దక్కడం పై వంగవీటి రాధ అప్పట్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా వంగవీటి రాధ వర్సెస్‌ మల్లాది విష్ణు అన్నట్టు అంతర్గత పోరు జోరందుకుంది. మల్లాది వర్గం తీరుపై పార్టీఅధ్యక్షుడు జగన్ కు ఫిర్యాదు చేసినా..సరైన స్పందన లేదని రాధాకృష్ణ అసంత్రుప్తిగా ఉన్నట్టు వైసీపీ క్యాడర్‌ చెప్పుకుంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో కేవలం వైసీపీ ఐదు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ముఖ్యంగా కాకినాడ నియోజక వర్గంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవడంతో అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ సీట్లపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అయింది.ఎన్నికల అనంతరం నష్టాన్ని భర్తీ చేసేందుకు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడ నియోజక వర్గం బాధ్యతల నుంచి తప్పించి.. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణని పార్టీలోకి తీసుకొని ఆయన తనయుడు శశి కి సమన్వయ కర్త బాధ్యతలు అప్పగించారు. ఇంతవరు బాగేనే ఉన్నా.. తాజాగా మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ బాధ్యతలు అప్పగించడంపై కాపు నేతలు జగన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అటు గుంటూరు జిల్లాలోనూ రెడ్డి వర్సెస్‌ కాపు సామాజికవర్గాల అంతర్గత పోరు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు-2 నియోజక వర్గంలో పోటీ చేసిన లేళ్ళ అప్పిరెడ్డి ఓటమిపాలయ్యారు. ఇక్కడ అప్పిరెడ్డికి కాపునేతలు సహకరించలేదనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ మరోసారి లేళ్లఅప్పిరెడ్డికి గుంటూరు పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వడంపై కాపునేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు, వరప్రసాద్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తూనే ఉండటం.. పార్టీ అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

పార్టీలో సాగుతున్న కాపు -రెడ్డివర్గాల అంతర్గతపోరు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనని వైసీపీ అధినాయకత్వం ఆందోళన పడుతోంది. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గాల్లో బలంగాఉన్న సామాజికవర్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*