Home / Homepage-Slider / రాహుల్‌గాంధీని కలిసిన విశ్వేశ్వర్‌రెడ్డి!

రాహుల్‌గాంధీని కలిసిన విశ్వేశ్వర్‌రెడ్డి!

టి.ఆర్.ఎస్ ను వీడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను ఈ భేటీలో ఆయన వివరించనున్నారు. ఈ నెల 23న మేడ్చల్‌ సభలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితికి, చేవెళ్ల లోక్‌సభ స్థానానికి కొండా విశ్వేశ్వరరెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇందుకు దారితీసిన పరిస్థితులను వివరించడంతోపాటు ప్రధానంగా ఐదు కారణాలను ప్రస్తావిస్తూ మంగళవారం సాయంత్రం మూడు పేజీల లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఆయన రాశారు.