దొంగతనం కేసులో ప్రముఖ పాటల రచయిత

మధురమైన పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు. వంద సినిమాలకు పైగా పాటలు రాశాడు. పరిస్థితులు మారాయి.. అవకాశాలు తగ్గడం… కుటుంబ వివాదాల నేపథ్యంలో చోరావతారం ఎత్తాడు. ఆలయాల్లో చోరీలు చేస్తున్న సినీ గేయ రచయిత కులశేఖర్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పది సెల్‌ఫోన్లు, రూ. 50 వేలు, రూ. 45 వేల విలువ చేసే బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నారు. డీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం… బంజారాహిల్స్‌, రోడ్డు నెంబర్‌ 2 ఇందిరానగర్‌లోగల ఓ దేవాలయంలో చోరీ జరిగింది. పూజారి బ్యాగ్‌తోపాటు రెండు సెల్‌ఫోన్లను నిందితుడు లాక్కొని పారిపోయాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు సినీ గేయ రచయిత కులశేఖర్‌గా తేలింది. విశాఖపట్నానికి చెందిన అతడు నగరానికి వచ్చి గేయ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

స్వగ్రామంలో తలెత్తిన ఓ వివాదంతో కులశేఖర్‌ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. దేవాలయాల్లో చోరీలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2013లో కాకినాడలోని హనుమాన్‌ దేవాలయంలో వెండి కిరీటం దొంగలించాడు. ఈ కేసులో 2016లో రాజమండ్రి జైల్లో ఆరు నెలల శిక్ష అనుభవించాడు. అతడి పరిస్థితి చూసి సినీ పరిశ్రమ విస్తుబోయింది. ఎన్నో మంచి పాటలు రాసిన కులశేఖర్‌ చోరుడిగా మారడం మింగుడు పడటం లేదని అప్పట్లో పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చాక నగరానికి వచ్చి బోరబండలో నివసిస్తున్నాడు. ఖర్చుల కోసం ఆలయాల్లో పూజారులు, భక్తుల బ్యాగ్‌లు, సెల్‌ఫోన్‌లు చోరీ చేయడం మొదలు పెట్టాడు. నిందితుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, అతడిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించామని పోలీసులు చెప్పారు.