Home / News / Andhra / పవన్ కళ్యాణ్ కి పుల్లారావు కౌంటర్!

పవన్ కళ్యాణ్ కి పుల్లారావు కౌంటర్!

తన ప్రాణాలకు ముప్పు ఉందన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఎవరిపైన అయినా అనుమానం ఉంటే ఆ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సలహా ఇచ్చారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో, రాష్ట్రంలో ప్రశాంత ప్రాంతాలుగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో కులాలు, మతాల పేరుతో విద్వేషాలతో రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. తనకు కొందరి నుంచి ప్రాణహాని ఉందని అంటున్న పవన్ కళ్యాణ్ ఎవరి నుంచి హాని ఉందో వారి పేర్లు చెప్పాలని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కోరారు. వారి పేర్లు బయటపెడితే పవన్ కి వారి నుంచి తగిన భద్రత కల్పిస్తామన్నారు.

ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్రానికే ధాన్యాగారాలని… ప్రశాంతతకు, అభివృద్ధికి మారుపేరుగా ఉండే ఉభయగోదావరి జిల్లాలపై అందుకే సీఎంకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కొల్లేరు ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతోందని మంత్రి పుల్లారావు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజలు జగన్‌ను ఓడించి అదృష్టవంతులవడమే కాకుండా… చంద్ర బాబును గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములయ్యారని మంత్రి పుల్లారావు చెప్పుకొచ్చారు.

అనంతరం మంత్రి పుల్లారావు దసరా పండుగ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ధరోహర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. గుజరాత్ లో గర్భా నృత్యాలలో ఉపయోగించే వస్తువులతో పాటు దాండియా నృత్యాల్లో అలంకరించుకునే వస్తువులను ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచడం విశేషం. క్రియేటివ్ సోల్ వ్యవస్థాపకులు సుమన్ మీనా, నేహా జైన్ నేతృత్వంలో ఈ ధరోహర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దశావతర దేవాలయానికి మచిలీపట్నంలో తయారు చేసిన ఆభరణాలను సరఫరా చేస్తున్నారని మంత్రి పుల్లారావు చెప్పారు. మరోవైపు తన భద్రత విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా పలువురు టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా తన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిఎం చంద్రబాబు చెబుతున్నట్లు తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలుసునని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కుల రాజకీయాలు చేసేందుకు తాను రాలేదన్నారు. విజ్ఞానవంతులు, మేధావులు రాజకీయాలను శాసించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.