చూసినంతనే పాపాలు తొలగించే నర్మద

సరస్వతీ నదీజలం మూడు రోజుల్లో పాపాలను పోగొడుతుంది. యమునా జలాలు ఏడు రోజుల్లో.. గంగానది స్నానం చేసిన వెంటనే.. పాపాలను పోగొడతాయి. కానీ.. నర్మదానది మాత్రం దర్శనమాత్రాననే సర్వపాపాలనూ పోగొడుతుందని మత్స్యపురాణం చెబుతోంది. మిగతా నదులకు, నర్మదకు అంత భేదం. ఆ నదిలో స్నానం చేశారా.. నీటిని కనీసం ముట్టుకున్నారా.. తాగారా అన్నదానితో సంబంధం లేదు. ఆ నది పేరు నర్మద అని తెలియకపోయినా.. ఒక్కసారి ఆ నది వంక చూస్తే చాలు. నదీతీర ప్రాంతంలోనే కాదు.. కలశంలో ఉన్న నర్మదాజలాలను చూసినా చాలు.. ఆవిడ ప్రీతిపొంది అనుగ్రహించేస్తుంది. ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు. ఇంకా విశేషమేమిటంటే.. నర్మదానది జలాలను పుక్కిటపట్టి ఉమిస్తే ఒక యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ఒకానొకప్పుడు పరమశివుడు ఋక్షపర్వతం మీద తపస్సు చేస్తుంటే ఆయన లోంచి పుట్టిన ఘర్మజలం నదీప్రవాహంగా బయల్దేరింది. అప్పుడా హరుడు.. ‘నీయందు నీరు సమృద్ధమగుగాక, నీవు ఎండిపోకుండెదవు గాక’ అని వరమిచ్చాడు.

అందుకే నర్మదానది జలాలు అడుగంటడం ఉండదు. ప్రళయం సంభవించినప్పుడు మార్కండేయుడికి వటపత్రశాయి దర్శనమైంది నర్మదా నది జలాలలోనే. ఒక రావి ఆకు మీద పడుకుని ప్రళయజలాలలో తేలుతున్నట్లు ఉండి.. చేత్తో తన కాలు పట్టుకుని కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ కనిపించిన కృష్ణ పరమాత్మను స్తోత్రం చేసిన మార్కండేయుడు ఆయనలోకి వెళ్లిపోయాడు. మళ్లీ పునఃసృష్టియందు బయటికి వచ్చాడు. అందుకే శంకరులవారు ‘జగల్లయే మహాభయే మృకండుసూను హర్మ్యదే’ అంటూ నర్మదాదేవి పాదాలకు నమస్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*