‘నోటా‌’ రివ్యూ

టైటిల్ : నోటా
జానర్ : పొలిటికల్‌ డ్రామా
తారాగణం : విజయ్‌ దేవరకొండ, సత్యరాజ్‌, నాజర్‌, మెహరీన్‌
సంగీతం : సామ్‌ సీయస్‌
దర్శకత్వం : ఆనంద్‌ శంకర్‌
నిర్మాత : జ్ఞానవేల్‌ రాజా

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నోటా. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. అరిమనంభి, ఇరుముగన్‌ సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్‌ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో విజయ్‌ కోలీవుడ్‌కు కూడా పరిచయం అవుతుండటంతో నోటా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల నోటా అందుకుందా..? ఈ సినిమాతో విజయ్‌ తన హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..?

కథ :
వరుణ్‌ (విజయ్‌ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్‌(నాజర్‌) కొడుకు. రాజకీయాలంటే గిట్టని వరుణ్‌ లండన్‌లో వీడియో గేమ్‌ డిజైనర్‌ గా పనిచేస్తుంటాడు. ఇండియాలోని కొన్ని అనాథాశ్రమాలకు మహేంద్ర (సత్యరాజ్‌) సహకారంతో సాయం చేస్తుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసే వరుణ్‌ అనుకోకుండా సీఎం కుర్చీలో కూర్చోవాల్సి వస్తోంది. తండ్రి వాసుదేవ్‌ ఓ కేసు విషయంలో విచారణ ఎదుర్కోవాల్సి రావటంతో రాజకీయాలతో సంబంధంలేని వరుణ్‌ ని అధికార పీఠం మీద కూర్చోపెట్టి వెనకుండి అంతా నడిపించాలని భావిస్తాడు వాసుదేవ్‌. కానీ ఆ కేసులో వాసుదేవ్‌కు శిక్షపడటం, బెయిల్‌పై తిరిగి వస్తుండగా వాసుదేవ్‌ మీద హత్యా ప్రయత్నం జరగటంతో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రి మీద జరిగినట్టుగానే తన మీద ఇతర కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని వెనుక వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెపుతాయి. అదే సమయంలో కోలుకున్న వాసుదేవ్‌.. వరుణ్ అధికారంలో ఉండేందుకు తనను మోసం చేస్తున్నాడని భావించి పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వరుణ్ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు.? మాజీ ముఖ్యమంత్రి వాసుదేవ్‌ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు.? చివరకు వరుణ్ రాజకీయ నాయకుడిగానే కొనసాగాడా.. లేదా? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సినిమాకు ప్రధాన బలం విజయ్‌ దేవరకొండ. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో అభిమానులకు షాక్‌ ఇస్తున్నాడు విజయ్‌. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డిఫరెంట్‌ లుక్‌, క్యారెక్టరైజేషన్‌తో మెప్పించాడు. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్‌ గా సూట్‌ అయ్యాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో విజయ్‌ నటన సూపర్బ్‌. మరో ప్రధాన పాత్రలో సత్యరాజ్‌ ఆకట్టుకున్నాడు. హీరోకు ప్రతీ విషయంలో సాయం చేసే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. మరో కీలక పాత్రలో నాజర్‌ జీవించారు. పార్టీ నాయకుడిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నాజర్‌ నటన సినిమాకు మరో బలం. హీరోయిన్‌ మెహరీన్‌ది దాదాపు అతిధి పాత్రే. ఇతర పాత్రల్లో సంచన నటరాజన్‌, ప్రియదర్శి, ఎంఎస్‌ భాస్కర్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ :
ఓ పొలిటికల్‌ డ్రామాకు విజయ్‌ దేవరకొండ లాంటి నటుణ్ని ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే దర్శక నిర్మాతలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్‌ నిలబెట్టుకున్నాడు. తానే ప్రధాన బలంగా మారి సినిమాను నడిపించాడు. హీరోను ప్లేబాయ్‌ల పరిచయం చేస్తూ సినిమాలు మొదలు పెట్టిన దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథ ప్రారంభించాడు. వెంటనే వరుణ్ పాత్ర సీఎం కావటం తరువాత రాజకీయ పరిణామాలతో ఫస్ట్‌ హాఫ్‌ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. విజయ్ నటన, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇలా ఫస్ట్‌ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది‌. అయితే సెకండ్‌ హాఫ్‌ను అదే స్థాయిలో తెరకెక్కించటంలో దర్శకుడు తడబడ్డాడు. ద్వితీయార్థంలో అక్కడక్కడ కథనం నెమ్మదించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇటీవల కాలంలో తమిళ రాజకీయల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. భారీ థ్రిల్స్‌ను ఆశించిన ప్రేక్షకులను క్లైమాక్స్‌ కూడా నిరాశపరుస్తుంది. సినిమాకు ప్రధాన బలం సామ్‌ సీయస్‌ మ్యూజిక్‌. పాటలు పరవాలేదనిపించినా సామ్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రతీ సీన్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
విజయ్‌ దేవరకొండ నటన
నేపథ్య సంగీతం
డైలాగ్స్‌