పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… జిల్లాలవారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని గుర్తుచేసుకున్న ఆయన… కొన్ని స్థానాల్లో పోటీ చేస్తే పార్టీ బలోపేతం ఆగిపోతుందనే… పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వడంతో వారు గెలిచారన్నారు. ఇక ఇందిరా గాంధీ మాదిరి ఒత్తిడి తట్టుకునే నాయకులు కావాలని సూచించిన జనసేనాని… ఏపీలో రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మళ్లీ సీఎం చేయండి అంటుంటే, వైసీపీ ఒక్కసారి సీఎం అవకాశం ఇవ్వండి అంటోందని ఎద్దేవా చేసిన పవన్… ఇలా సీఎం పదవి కోరుకునే వారికి చిత్తశుద్ది ఉండదని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాలని చిరంజీవి పార్టీ పెడితే ఆయన పక్కన ఉండే వారే నిరాశకు గురిచేశారన్నారు పవన్.