అప్పట్లో ఎన్టీయార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్!

దోపిడిరాజ్యం.. దొంగల రాజ్యమంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ ఈసారి నిజంగానే ఒక సరిహద్దు సమస్యను తన భుజాల మీద మోస్తున్నాడా?ఎప్పుడో ఏర్పడిపోయిన ఉత్తరాది-దక్షిణాది సరిహద్దు ‘కంచె’ ను జనంలోకి వేగంగా మళ్ళీ తీసుకువచ్చిన ఈ గబ్బర్ సింగ్ .. తదుపరి ప్రణాళిక ఏంటో చెప్పకనే చెప్పేశాడా అనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లారా మేలుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా సందేశాలు ఇస్తున్న పవన్ కల్యాణ్ తిక్కకూ నిజంగా లెక్కుందంటారా?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కేంద్రం మీదే మరో మారు ధ్వజ మెత్తాడు. మన భాష, జాతి, సంస్కృతులను కేంద్రం గౌరవించలేక పోతే, మన దేశ సమగ్రతను కాపాడలేకపోతే వేర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసినట్టే అవుతుందని ట్వీట్ చేశాడు. అంతకుముందు ఉత్తరాది పెత్తనం వద్దని కూడా పేర్కొన్నాడు.మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని మోదీ చేసిన సూచన నేపథ్యంలో హిందీ గో బ్యాక్ అంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని పవన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఉత్తరాది నాయకులు ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించాలని ఆయన కోరాడు.

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిపోతోందని.. ఎన్టీయార్ రోజుల్నుంచీ వినిపిస్తున్న మాటే. దక్షిణాది రాష్ట్రాల్ని చిన్నచూపు చూడ్డమనేది చాలా పాత విషయం. ఆత్మగౌరవ నినాదంతో గొంతెత్తిన ఎన్టీయార్ లాంటి మహానాయకుడికి సైతం కంఠ శోషే తప్ప మిగిలింది మాత్రం శూన్యం.అయితే ఆయన తరవాత ఈ స్వరం వినిపించిన నాధుడే లేడు.. కానీ తాజాగా దక్షిణాది వాదం తన భుజాల మీద వేసుకున్న పవన్ కళ్యాణ్ ఎంత వరకు సఫలీకృతుడు అవుతాడు అన్నదే ఇక్కడ ప్రశ్న! అప్పట్లో ఎన్టీయార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్. పోలిక పెద్దదే. కానీ. అసంబద్ధమైతే కాదు…?

తెల్లతోలు, నల్లతోలంటూ కొత్త తేడాల్ని పుట్టిస్తున్న నార్తిండియన్ నోటికి  గొళ్లెం పెట్టాలన్నది జనసేనుడి ప్రయత్నం. ఐతే.. దక్షిణాది గొంతుకల్ని ఏకీకృతం చేయడంలో ‘పవనుడు’ ఎంతవరకు సఫలీకృతుడు అవుతాడనేదే ఇక్కడ సందేహం! ఉత్తరాది రాజకీయాలతో పెట్టుకుంటే తమ రాజకీయ భవిష్యత్తులు ఏమైపోతాయన్న భయాలు మన రాజకీయ నాయకుల్లో ఉన్నంతకాలం ఈ గబ్బర్ సింగ్ కాదు కదా ఎవ్వరొచ్చినా ఏం చేయలేరు! అయితే పవన్ కళ్యాణ్ ఆ భయం పోగొడితే మాత్రం దక్షిణం దిక్కు దుమ్మురేపడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*