మచ్చలేని చర్మానికి దానిమ్మ!

దానిమ్మ గింజల్ని తింటే ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు. అంతేకాదు ఇది మంచి సౌందర్య సాధనం కూడా. అందుకే దీన్ని సౌందర్యోత్పత్తుల్లో వినియోగిస్తారు. కాబట్టి ఇక మీదట దానిమ్మ పండు వలవడం కష్టమంటూ దాన్ని పక్కకి నెట్టేయకండి. కాస్త కష్టపడితే ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతమవుతుంది.

జీర్ణ సంబంధిత లేదా హార్మోన్‌ల అసమతుల్యత వల్ల చర్మం మీద మొటిమలు, కురుపులు ఏర్పడతాయి. వీటినుంచి బయటపడాలంటే దానిమ్మ గింజల్ని మించిన పరిష్కారం మరొకటి లేదు. వీటికి జీర్ణసంబంధిత సమస్యల్ని నయం చేసే గుణం ఉంది. శరీరంలో రక్తప్రసరణ సరిగా జరిగేలా చేస్తాయి. అలాగే దానిమ్మ గింజల రసాన్ని మొటిమలు ఉన్న చోట రాసుకుంటే మచ్చలు పడవు.

సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మంపై లేదా వయసు మీద పడడం వల్ల వచ్చే చర్మ సమస్యలకు బెస్ట్‌ రెమెడీ దానిమ్మ గింజల రసం. ఇది దెబ్బతిన్న చర్మాన్ని సరిచేస్తుంది. మృదువైన, యవ్వనవంతమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. చర్మంలో ఉండే ఫైబ్రాబ్లాస్ట్‌ కణాల జీవిత కాలాన్ని పెంచుతాయి దానిమ్మ గింజలు. కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌ల ఉత్పత్తికి కారణం ఈ కణాలే. స్థితిస్థాపకత అంటే వ్యాకోచించే గుణాన్ని చర్మానికి ఇస్తాయి కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌లు. దీనివల్ల చర్మం ముడుతలు పడదు.

దానిమ్మలో ఉండే సూక్ష్మ అణు నిర్మాణం వల్ల చర్మం లోతులకి చొచ్చుకుపోతుంది. అందుకే చర్మాన్ని పరిరక్షి స్తాయి ఇవి. దానిమ్మ నూనె పొడి చర్మ సమస్యలకు బెస్ట్‌ రెమెడీ.

పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం వంటి చర్మ సమస్యల నుంచి బయపటడాలంటే దానిమ్మ కేరాఫ్‌ అడ్రస్‌. దీనిలోని ప్యునిక్‌ అనే పదార్థం ఒమెగా 5 ఫ్యాటీ ఆమ్లం. ఇది చర్మం తేమ కోల్పోకుండా ఉంచుతుంది.

దానిమ్మ నూనె జిడ్డు చర్మంపై కూడా బాగా పనిచేస్తుంది. అందుకే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో దానిమ్మను విరివిగా వాడతారు. అలాగే మొటిమలు, కురుపులు ఏర్పడే చర్మతత్వం ఉన్న వాళ్లు దీన్ని వాడితే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*