రా..రా… సినిమా రివ్యూ

100కుపైగా చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న శ్రీకాంత్ తొలిసారి రా రా అనే ఓ హారర్, కామెడీ చిత్రంలో నటించాడు. హారర్, కామెడీ చిత్రంలో శ్రీకాంత్ అభిమానులను, ప్రేక్షకుడిని మెప్పించాడా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

హాలీవుడ్ స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించాలనే తపన ఉన్న డైరెక్టర్ శ్రీకాంత్. తన తండ్రి (గిరిబాబు) కూడా 100 చిత్రాలు తీసిన గొప్ప డైరెక్టర్. అయితే శ్రీకాంత్ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. చివరకు తండ్రినే నిర్మాతగా పెట్టి శ్రీకాంత్ సినిమా తీస్తాడు. కానీ అదీ కూడా ఫట్ మనడంతో తండ్రి గుండె ఆగి చనిపోతాడు. తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతుంది. దాంతో ఓ శుభవార్త చెప్తేనే తల్లిని రక్షించుకోగలుగుతావు, ఓ హిట్ సినిమా తీస్తే తల్లి ఆరోగ్యం కుదుటపడవచ్చు అని శ్రీకాంత్‌తో డాక్టర్ చెబుతాడు. దాంతో దెయ్యం కథతో హిట్ సినిమా తీసే పనిలో పడుతాడు.

ఓ పాడుబడిన ఇంట్లోకి చేరిన శ్రీకాంత్ బృందం దెయ్యాల బారిన పడుతుంది. దెయ్యాల బారిన పడిన శ్రీకాంత్ టీమ్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఇంతకు శ్రీకాంత్ హిట్ సినిమా తీసి తల్లిని రక్షించుకొన్నాడా? సినిమా తీసే క్రమంలో దెయ్యం (నాజియా)తో ప్రేమలో పడిన శ్రీకాంత్ లవ్‌స్టోరీ ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారా సినిమా కథ

అడవిలో ఓ పాడుబడిన ఇంటిలో ఉన్న దెయ్యాలను తరమికొట్టేందుకు ఓ విదేశీ బృందం రావడం, మృత్యవాత పడటంతో సినిమా ప్రారంభమవుతుంది. శ్రీకాంత్ సినిమాల ఫ్లాప్‌లతో కథ సాగుతుంటుంది. తండ్రి మరణించడం, తల్లికి జబ్బు చేయడం లాంటి అంశాలకు సెంటిమెంట్ కలిపి కథలో కొంత ఆసక్తిరేపే ప్రయత్నం జరుగుతుంది. అయితే నాసిరకమైన కథ, కథనాలతో సినిమా ఏంటో ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది. రఘుబాబు, హేమ దెయ్యాల బృందం ఎపిసోడ్ ప్రేక్షకుడికి నరకయాతనగా మారుతుంది. ఇదిలా ఉండగానే మరో దెయ్యాల బృందం ఇంట్లోకి చేరడంతో ఇంటర్వెల్ పడుతుంది.

ఇక సెకండాఫ్‌లో రెండో బృందం చేరిన తర్వాత జరిగే సన్నివేశాలు కొంత మెరుగ్గా అనిపిస్తాయి. శ్రీకాంత్, హీరోయిన్ మధ్య జరిగే రొమాంటిక్ సీన్లు కొంత రిలీఫ్‌గా అనిపిస్తాయి. కాకపోతే మళ్లీ నాటు సీన్లతో సినిమాను గందరగోళంగా మార్చారు. క్లైమాక్స్‌లో కూడా ఎలాంటి ట్విస్టులు, ఆసక్తికరమైన విషయాలు లేకుండానే కథ ముగిసిపోతుంది. మరణించి నన్ను ప్రేమించడం కంటే.. తల్లిని బతికించుకొని నాకు దూరం కావడమే మంచిది అని శ్రీకాంత్‌తో దెయ్యం (హీరోయిన్ నాజియా) చేత మంచి సందేశాన్ని చెప్పించడం కొంత ఊరటగా అనిపిస్తుంది

రారా చిత్రానికి డైరెక్షన్ చేసిన దర్శకుడి పేరును ఏదో కారణం చేత గోప్యంగా ఉంచారు. టైటిల్స్‌లో మాత్రం వీజీ చరీష్ యూనిట్ అని వేశారు. కొత్తదనం లేని పాయింట్‌తో దర్శకుడు రారా సినిమాను నాసిరకంగా మలిచాడనే భావన కలుగుతుంది. పాత రికార్డుల అరిగిపోయిన రోటీన్ సీన్లు విసుగు కలిగిస్తాయి. ఆసక్తికరంగా లేని సీన్లకు తోడు నిడివి మరొక ఇబ్బంది కలిగించే అంశమని చెప్పవచ్చు.

గత రెండు దశాబ్దాల కాలంలో శ్రీకాంత్ ఎన్నో మంచి పాత్రలను పోషించారు. వైవిధ్యమైన చిత్రాల్లో కనిపించారు. సుమారు 100 చిత్రాలకు పైగా అనుభవం ఉన్న శ్రీకాంత్ స్టాటస్‌కు సరితూగని చిత్రం ఇది. శ్రీకాంత్ నటనను అభిమానించి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు పక్కగా నిరాశ కలిగించే విషయం. శ్రీకాంత్ మార్కు నటన ఎక్కడా కనిపించదు.

ఇక హీరోయిన్ నాజియా నటన, గ్లామర్ అంతంత మాత్రంగానే ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో నాజియా తన నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కానీ పాత్రలో ఇంటెన్సిటీ ఉన్నాగానీ సన్నివేశాల చిత్రీకరణలో పస లేకపోవడంతో నాజియా కూడా ఏమి చేయలేకపోయింది.

రారా చిత్రంలో లెక్కకు మించి హాస్యనటులే కనిపించారు. ఆలీ, పోసాని కృష్ణమురళీ, నారాయణ,రఘుబాబు, పృథ్వి, జీవ, చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు, గబ్బర్ సింగ్ గ్యాంగ్ లాంటి వారందర్ని తెర మీద నింపారు. అయితే ఏ ఒక్క సీన్‌లో కూడా వారి హాస్యం ఆకట్టుకునేలా లేకపోవడం సినిమా నిస్సారంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో షకలక శంకర్ ఫర్వాలేదనిపించాడు.

రారా చిత్రానికి ర్యాప్‌రాక్ షకీల్ సంగీతం అందించారు. కీలక సన్నివేశాల్లో రీరికార్డింగ్ ఓకే అనిపించేలా ఉంది. పాటలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. పూర్ణ ఫొటోగ్రఫీ బాగుంంది. శంకర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఇంకా చేతి నిండా పని ఉందనే భావన కలుగుతుంది.

రారా చిత్రానికి శ్రీమిత్ర చౌదరి, విజయ్‌లు నిర్మాతగా వ్యవహరించారు. వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కథ, కథనాల ఎంపికలో లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. నాసిరకమైన కథను వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బలంగా మారాయి.

టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నో హారర్, కామెడీ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఆ కోవలోనే వచ్చిన చిత్రం రారా. అయితే కథ, కథనాలు ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. హారర్, కామెడీ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా కనెక్ట్ కావడం కష్టమే. బీ, సీ సెంటర్లలో ఆదరించడం బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:

శ్రీకాంత్,

రీరికార్డింగ్సి,

నిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్:

కథ,

కథనం,

కామెడీ,

ఎడిటింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*