గ్రహదోషాలను నివారించే కాలభైరవాలయం

కాలుడు అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమ గల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అందుకే నిత్యం అశేష భక్తుల తాకిడితో ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది.

ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. స్వామివారి మూలవిగ్రహం ఎప్పుడు వెలిసిందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. జైనమతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని, అందుకే స్వామి దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. కానీ పురాణేతిహాసాల్లోనూ శ్రీ కాలభైరవుడిని దిగంబరుడిగానే పేర్కొనడం జరుగుతుంది.

ఇసన్నపల్లి గ్రామం ప్రారంభంలోనే శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఉంటుంది. అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడు గ్రామాన్ని రక్షిస్తుంటారని నానుడి. ఈ అష్టభైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాలప్రవాహంలో కనుమరుగైపోయాయి. గ్రామానికి కిలోమీటరు దూరంలో కాశిపల్లి అనే చోట విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందు భాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం కూడా ఉన్నాయి. ఇలా రామారెడ్డి గ్రామం చుట్టూ కాశీ (కాశిపల్లి), రామేశ్వరం (రామేశుని కుంట) ఇలాంటి పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవస్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకుని నిరంతరం గ్రామాన్ని, భక్తులనూ రక్షిస్తూ ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడి పుష్కరిణిని అమృతమయమైన నీళ్లను అందించే అక్షయ పాత్రగా భావిస్తారు. ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద ఈ పుష్కరిణి ప్రత్యేకత. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే వారికి అన్ని రకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని నమ్మకం. స్వామివారికి నిత్యపూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి యేడాది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీకమాసంలో స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలోనూ సంతతాభిషేకం, విశేషపూజలు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*