Mana Aksharam
Cinema Entertainment Reviews

సిల్లీ ఫెలోస్‌ రివ్యూ & రేటింగ్

silli fellows movie review rating

సిల్లీ ఫెలోస్‌ రివ్యూ & రేటింగ్

న‌రేష్ కామెడీ బాగుంటుంది. త‌న‌కి సునీల్ తోడైతే… ఇక ఆ అల్ల‌రి రెట్టింపు అవ్వ‌డం ఖాయం. వీరిద్ద‌రే ‘కిత‌కిత‌లు’ పెట్టేస్తార‌నుకుంటే… భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు తోడ‌య్యారు. ఆయ‌న కూడా కామెడీపై మాంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడే. ఈ ముగ్గురు క‌లిస్తే… వినోదం వీర విహారం చేయ‌డం గ్యారెంటీ! ఆ న‌మ్మ‌క‌పై `సిల్లీ ఫెలోస్‌` పోస్ట‌ర్లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు చూస్తున్న‌ప్పుడు క‌లిగింది. మ‌రి ఈ ముగ్గురూ ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారా? ‘సిల్లీ ఫెలోస్‌’ని ఫ‌న్నీ ఫెలోస్‌గా మార్చారా? థియేట‌ర్లో ఈ ముగ్గురూ క‌లి‌సి చేసిన అల్ల‌రేంటి?

కథేంటంటే: ఎమ్మెల్యే జాకెట్ జాన‌కిరామ్ (జ‌య‌ప్ర‌కాశ్‌ రెడ్డి) కి న‌మ్మిన బంటు సూరిబాబు (న‌రేష్‌). జానకిరామ్‌ మంత్రి అయితే.. తాను ఎమ్మెల్యే అయిపోవాల‌ని ఎదురుచూస్తుంటాడు. జాన‌కిరామ్‌కి మ‌రింత పేరు రావాల‌ని ఏర్పాటు చేసిన సామూహిక వివాహాల కార్య‌క్ర‌మం అభాసుపాలు అవ్వ‌కుండా చూస్తాడు సూరిబాబు. దానికోసం త‌న ఫ్రెండు వీర‌బాబు (సునీల్‌)కి పుష్ప‌తో బ‌ల‌వంతంగా పెళ్లి చేయించేస్తాడు.

త‌న ప్రియురాల్ని పోలీస్ చేయ‌డానికి జాన‌కి చేత పై అధికారుల‌కు రూ.10 ల‌క్ష‌లు లంచం కూడా ఇప్పిస్తాడు. పుష్ప.. వీర‌బాబుకి విడాకులు ఇవ్వాల‌న్నా, రూ.10 ల‌క్ష‌ల మేట‌ర్ సెటిల్ అవ్వాల‌న్నా… జాన‌కిరామ్ చేతుల్లోనే ఉంటుంది. అయితే అలాంటి జాన‌కిరామ్‌కి ఓ ప్ర‌మాదం జ‌రిగి కోమాలోకి వెళ్లిపోతాడు. జాన‌కిరామ్ ద‌గ్గ‌రే రూ.500 కోట్ల‌కు సంబంధించిన ఓ ర‌హ‌స్యం కూడా ఉంది. ఆ రూ.500 కోట్లు ఎవ‌రివి? జాన‌కిరామ్ కోమాలో నుంచి బయటపడ్డాడా? సూరిబాబు, వీర‌బాబుల క‌థ ఏమైంది? అనేది తెలియాలంటే `సిల్లీ ఫెలోస్‌` చూడాలి.

ఎలా ఉందంటే: కామెడీ సినిమాల‌కు క‌థ‌కంటే.. స‌న్నివేశాలు వాటి నుంచి పుట్టే హాస్యం ప్ర‌ధానం. భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు కూడా క‌థ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. క‌థ‌నం స‌రిగ్గా కుదిరితే చాలు అనుకున్నాడు. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ వినోదం పండించాల‌ని ప్ర‌య‌త్నించాడు. అది కొంత‌మేర స‌ఫ‌లీకృత‌మైంది. మ‌రీ ముఖ్యంగా తొలి స‌గంలో వ‌చ్చే స‌న్నివేశాలు బాగుంటాయి. పుష్ప‌… అంటూ సునీల్‌ని ఆడుకునే సీన్లు బాగానే పేలాయి. బ్ర‌హ్మానందంతో పోలీస్ గెట‌ప్ వేయించ‌డం, అంత పెద్ద పోలీస్ ఆఫీస‌ర్ అయివుండి ఆటోలో రావ‌డం, ఆయన వేసే కౌంటర్లు ఓకే అనిపిస్తాయి. తొలి స‌గంలో ఒకే ఒక్క పాట ఉంది. అది కాస్త జోష్‌గానే సాగింది. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు లేక‌పోయినా.. అక్క‌డ‌క్క‌డ కొన్ని సీన్లు బాగానే న‌వ్వించాయి. ద్వితీయార్ధం వ‌చ్చేస‌రికి క‌థ‌, క‌థ‌నం రెండూ గాడి త‌ప్పాయి. ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయించే డ్రామా పాత సినిమాల్లోని స‌న్నివేశాల్ని గుర్తుకు తెచ్చాయి. వాటి నుంచి వినోదం పండ‌క‌పోగా… నీర‌సం తెప్పించాయి. ద్వితీయార్ధంలో సునీల్, న‌రేష్ ఇద్ద‌రూ ఎందుకో డ‌మ్మీలుగా మారిపోతారు. పోసాని, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ఇద్ద‌రూ లీడ్ తీసుకుంటారు. `ఆ రోజు పొద్దుటే కోడి కొక్కొరొక్కో` అంటూ జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి – పోసాని మ‌ధ్య‌సాగిన కామెడీ ట్రాక్ ఆక‌ట్టుకుంటుంది. కానీ దాన్ని కూడా సాగ‌దీయ‌డంతో అది కూడా విసుగు పుట్టిస్తుంది. రెండో స‌గంలో కూడా ఒకే ఒక్క పాట‌కు చోటిచ్చారు. అది మాస్‌కి ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలో లాజిక్కుల గురించి ద‌ర్శ‌కుడు ప‌ట్టించుకోలేదు. ఎమ్మెల్యే మంత్రి అయితే.. ఆ సీటు ఎందుకు ఖాళీ అవుతుంది? ఇలాంటి సన్నివేశాల్లో అర్థం లేదనిపిస్తుంది. ముగింపు కూడా ప‌ర‌మ రొటీన్‌గా అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: న‌రేష్ కామెడీ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇందులోనూ అంతే. కాక‌పోతే పేర‌డీల జోలికి వెళ్లలేదు. అదొక్క‌టే ప్ల‌స్ పాయింట్‌. చాలా కాలం త‌ర‌వాత సునీల్ తెర‌పై హాస్య న‌టుడిగా క‌నిపించాడు. త‌న వంతు న్యాయం చేశాడు. కాక‌పోతే మ‌రీ లావుగా ఉన్నాడు. క‌థానాయిక‌లు ఇద్ద‌రున్నా.. ఎవ‌రికీ స‌రైన ప్రాధాన్యం లేదు. జేపీ, పోసాని న‌వ్వించారు. మిగిలిన‌వాళ్ల‌లో చెప్పుకోద‌గిన పాత్ర ఎవ‌రికీ ప‌డ‌లేదు. బ్ర‌హ్మానందం చాలా కాలం త‌ర‌వాత మళ్లీ తెరపై సందడిచేశారు. రెండే రెండు పాట‌లున్నాయి. అవి బాగున్నాయి. ఈ సినిమాని వీలైనంత త‌క్కువ‌ బడ్జెట్‌తో తీయాల‌ని ఫిక్స‌యిపోయి ఉంటారు. అందుకే… క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డిపోయారు. సంభాషణల్లో కొన్ని చోట్ల పంచ్‌లు పేలాయి. ఏటీఎంలో డ‌బ్బులు రావడం లేదు, వెన్నుపోటు రాజ‌కీయాలు, విజ‌య్ మాల్యా.. ఇలా స‌మ‌కాలిన అంశాలపై జోకులు వేసుకున్నారు. ఇదో రీమేక్‌. ద‌ర్శ‌కుడు దాదాపుగా త‌మిళ సినిమాని ఫాలో అయిపోయాడు. కాబ‌ట్టి ఆయ‌న్నుంచి ఎలాంటి మెరుపులూ, జోడింపులూ లేవు.

Related posts

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ రివ్యూ

admin

హిజ్రా గా అక్షయ్ కుమార్!

Masteradmin

సూర్య ఫ్యాన్స్‌కు స‌ర్కార్ షాక్‌

Manaaksharam