కళతప్పిన ఏపీ సచివాలయం!

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఏపి లోని ప్రజా ప్రతినిధులు అందరూ నియోజకవర్గాలలో తెగ తిరిగేస్తున్నారు. మంత్రులు కూడా నియోజకవర్గాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యమైన పని ఉంటే తప్ప సెక్రెటరియేట్ కు రావడంలేదు. దీనితో ఏపి సెక్రెటరియేట్ కళతప్పుతోంది. నిత్యం వివిధ పనులమీద సెక్రెటరియేట్ కు వచ్చే సందర్శకులతో కళకళలాడే సెక్రెటరియేట్ ఇటీవల వెలవెలబోతోంది.

ఎన్నికలు నాలుగునెలలు మాత్రమే ఉండటంతో మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమౌతున్నారు. కార్యకర్తల తో సమావేశాలు నిరహించుకుంటూ గడిపేస్తున్నారు..అంతే కాకుండా పార్టీలోనికి ప్రత్యర్థి పార్టీనుండి జెంప్ జిలానీలను చేర్చుకోవడంతో యమ బిజీగా ఉన్నారు. జనంకు అందుబాటులో ఉండి ఏమాత్రం అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనితో మంత్రులతో పనులు ఉండేవారు ఆయా నియోజకవర్గాలకే వెళ్లి వారిని కలుస్తున్నారు. దీనితో మంత్రుల పేషీలు కూడా వెలవెలబోతున్నాయి. జనం తాకిడి తగ్గడంతో ఏపి సెక్రెటరియేట్ ఖాలీగా కనబడుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెక్రెటరియేట్ కు రావడం కాస్త తగ్గించారు. తెలంగాణాలో ఎన్నికల ప్రచారం, ధర్మపోరాట దీక్షలు, బిజెపికి వ్యతిరేకంగా జాతీయ నాయకులను కూడగట్టడం, తెలుగదేశం పార్టీ సమావేశాలు, నాయకులతో సమాలోచనలతో బిజీగా ఉంటున్నారు. ఒకవైపు పాలనపై దృష్టి పెడుతూనే చంద్రబాబు ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఎక్కువగా జిల్లాలు పర్యటిస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టడంలో నిమగ్నమౌతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సెక్రెటరియేట్ కు రావడం తగ్గించడంతో సందర్శకులు అమరావతివైపు చూడటం తగ్గించారు. మంత్రులతో పనులు చేయించేందుకు అనుచరగణతో రోజు వచ్చి హల్చల్ చేసేవారు, చోటామోటా నాయకులు కూడా కనుపించడం లేదు.

మంత్రులు రివ్యూలు తగ్గిచడంతో ఆ బాధ్యత సిఎస్ పునేఠ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. పలు శాఖలకు చెందిన రివ్యూలు ఆయనే స్వయంగా చేస్తున్నారు. మంత్రులు రాజకీయా కార్యకలాపాల్లో బిజీ కావడంతో సిఎస్ పునేఠ శాఖల పనితీరు గాడి తప్పకుండా నిత్యం రివ్యూలు చేస్తూ పాలనను ముందుకు తీసుకవెడుతున్నారు. కదలని తమ ఫైళ్ల దుమ్ము దులిపించేదుకు వచ్చే కొందరు మినహా సెక్రెటరియేట్ వద్ద జనం కరువయ్యారు. దీనితో ఏపి సెక్రెటరియేట్ వెలవెలబోతోంది.