గెలిచి ఓడిన కమలనాధులు!

గుజరాత్ ఫలితాలు బీజేపీలో కలవరాన్ని పెంచాయా? పైకి నవ్వుతూ, స్వీట్లు పంచుకుంటున్న కమలనాథులు లోలోన కుమిలిపోతున్నారా? సునాయాసంగా గెలవాల్సిన మోడీ సొంత రాష్ట్రంలో పేలవమైన ఫలితాలు రాబట్టడంపై కమలనాధులేమనుకుంటున్నారు?

గుజరాత్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ పైకి చిరునవ్వులు చిందిస్తున్నా లోలోన మాత్రం మదనపడుతోంది పార్టీ పరిస్థితిపైనా, కాంగ్రెస్ పుంజుకోడం పైనా పార్టీలో పైకి కనపడని గుబులు కనిపిస్తోంది ఎన్నికల ఫలితాలు అభివృద్ధికి పట్టం కట్టాయని పైకి చెబుతున్నా భవిష్యత్తులో బీజేపీ జాగ్రత్త పడకపోతే పునాదులు కదులుతాయన్న ఆందోళన కమలనాధుల్లో మొదలైంది.ఇక ఆసక్తికరమైన అంశమేంటంటే ఓట్ల లెక్కింపు మొదలై కాంగ్రెస్ దూకుడు స్పష్టంగా కనిపించిన క్రమంలోనే బీజేపీ నేతల మాటల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాకు భిన్నంగా మొదటి నుంచే కాంగ్రెస్ దూకుడు కనిపించడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం విశేషం.

22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక వెలువడిన తొలి ఫలితాల్లోనే సానుకూల సంకేతాలు రావడం ఆ పార్టీ నేతల్లో జోష్ పెంచుతోంది. రాహుల్ హిందూత్వ ఓట్లకు గాలం వేయడానికి ఆలయాల సందర్శన చేయడం, జంధ్యం ధరించడం, తాను శివభక్తుడినని చెప్పడం లాంటి ఎన్నికల జిమ్మిక్కులు పనిచేసాయనే అనుకోవాల్సి వస్తుంది 2012 లో కాంగ్రెస్ కి ఉన్నవి కేవలం 61 సీట్లు కానీ ఇప్పుడు ఆ పార్టీ 20 సీట్లు అదనంగా పొందింది వాస్తవానికి తొలిదశ పోలింగ్ తర్వాతే కమలనాథుల్లో కలవరం పెరిగింది.

గుజరాత్ లో కనిపించిన రాహుల్ ఎఫెక్ట్ ను లైట్ తీసుకుంటే జరగబోయే ప్రమాదం పెద్దగానే ఉంటుందని నేతల అంతర్గత సంభాషణల్లో వ్యక్తమవుతుండడం విశేషం. మరి గుజరాత్ ను పరిగణనలోకి తీసుకొని మోడీ-అమిత్ షా ద్వయం కొత్త వ్యూహాలు రచిస్తారా..? వివిధ సామాజికవర్గాల్లో నెలకొన్న వ్యతిరేకతను అధిగమించేందుకు ఏం చర్యలు తీసుకుంటారు..?ఇలాంటి అనేక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని బీజేపీ నేతలు ఆలస్యంగానైనా గుర్తించారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*