నిండు ప్రాణాలు రోడ్లకు బలి..

లక్షలు… కోట్లు పోసి కొన్న కార్లు.. ఎన్నో సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్.. అయినా.. యాక్సిడెంట్‌లు జరుగుతూనే ఉన్నాయి. విలువ కట్టలేని ప్రాణాలు రోడ్లకు బలైపోతున్నాయి.. లోపం ఎక్కడ ఉంది.. కార్లలోనా.. నడిపేవారిలోనా.. లేక రోడ్లలోనా…? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే తప్ప.. రోడ్లపై రక్తపాతానికి అడ్డుకట్ట పడదు.. ఇవి మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ యాక్సిండెంట్ దృశ్యాలు.. అత్యంత వేగంగా వచ్చిన బెంజ్‌ కారు.. మెట్రో పిల్లర్లు బలంగా ఢీకొట్టింది. కారు ఎగిరి పడడం చూస్తే.. కారు వేగం ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. కారులో స్పీడో మీటర్‌ 220 కిలోమీటర్ల దగ్గర ఆగిపోయి ఉంది. హైదరాబాద్ రోడ్లపై అంత వేగంగా డ్రైవ్‌ చేయొచ్చా..? ఇదే ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న.

హైదరాబాద్‌లో అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖల పిల్లలు, విద్యార్థులు.. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. కారణం.. మితిమీరిన వేగం. హైదరాబాద్‌ రోడ్లపై 60 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లడానికి లేదు. పగటి పూట ట్రాఫిక్ కారణంగా నిదానంగానే వెళ్తున్నా.. రాత్రుళ్లు మాత్రం వాహనదారులు రెచ్చిపోతున్నారు. ఓవర్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. చివరకు రోడ్లకు  బలైపోతున్నారు.  నిశిత్‌ ప్రమాదాన్ని పరిశీలించినా ఇదే అర్థమవుతుంది. చెక్‌పోస్ట్‌ నుంచి దాదాపు 220 కిలోమీటర్ల  వేగంగా మాదాపూర్‌ వైపు కారు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో  రోడ్డు డౌన్ అవుతుంది. వెంటనే మలుపు తిరుగుతుంది. రోజూ వెళ్లే దారే అయినా.. మితిమీరిన వేగంతో ఉండడంతో.. వాహనం కంట్రోల్ కాలేదు.. అదుపు తప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది.  ఎంత స్పీడ్‌తో వెళ్లినా సేఫ్‌గా వెళ్లడానికి హైదరాబాద్‌ రోడ్లేమీ స్ట్రెయిట్‌ లైన్లు కావు. ఊహించని రీతిలో మలుపులు.. అవి చాలవన్నట్లు అడుగడుగునా  గుంతలు.. నడి రోడ్లపై నానా చెత్తా చెదారం.. సాధారణ వేగంతో వెళితేనా వీటిని సేఫ్‌గా దాటడం కష్టం.. అలాంటిది ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లితే ఇంకేమైనా ఉంటుందా..? బండి అదుపు తప్పడానికి ఒక్క గుంత చాలు.. ఎంత పర్‌ఫెక్ట్ డ్రైవర్‌ అయినా.. కారు ఫల్టీలు కొట్టాల్సిందే. ఇక ఔటర్‌ రింగ్ రోడ్.. జాతీయ రహదారులపైన అయితే.. వాహనాల గరిష్ట వేగం వంద కిలోమీటర్లే. కానీ.. అక్కడా.. 150.. 200 కిలోమీటర్ల స్పీడ్‌తో వాహనాలు దూసుకుపోతున్నా పట్టించుకునేవాళ్లెవరూ లేరు. వారాంతాల్లో సిటీలో కాసేపు డ్రంకెన్‌ డ్రైవింగ్ తనిఖీలు చేసే పోలీసులు.. ప్రతీ రాత్రి  జోరుగా సాగుతున్న ఓవర్‌ స్పీడ్ డ్రైవింగ్ పై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఈ ఓవర్‌ స్పీడ్‌కు బ్రేక్‌ వేయకపోతే.. ఎంతో మంది ఇంకా మృత్యు కౌగిలిలో చిక్కుకు పోతూనే ఉంటారు. ట్రాఫిక్‌ పోలీసులే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు రాత్రిళ్లు ఎటెళ్తున్నారోనని ఓ కంట కనిపెడితేనే తల్లుల గర్భశోకం ఆగిపోతుంది. అర్థరాత్రి దాటిన తర్వాత మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను నియంత్రించడంపై ఇకనైనా దృష్టి సారించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*