తెదేపా మహిళా నేత దారుణ హత్య

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు రామిల్ల కవిత(30) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై దాడికి పాల్పడిన దుండగులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కవితకు ఇద్దరు కుమార్తెలు శ్రీజ (15), శిరిణి(14) ఉన్నారు. పదేళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఆమె ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు కవిత తన పిల్లలను తీసుకొని ఆదివారం మంథని వెళ్లారు. వేడుకల అనంతరం నూతన వధువుకు తోడుగా తన చిన్న కుమార్తె శిరిణిను పంపించి పెద్ద కుమార్తె శ్రీజతో రాత్రికి ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండుగులు కవితపై హత్యాయత్నం చేస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన శ్రీజ కాళ్లు, చేతులు కట్టేసి మరో గదిలో బంధించారు. తాను చూస్తుండగానే కన్నతల్లిపై జరుగుతున్న దాడిని తట్టుకోలేక ఆ చిన్నారి దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుండగులు అక్కడే ఉన్న కత్తిపీటతో కవిత తలపై దాడిచేసి నరికి హత్య చేశారు. కవిత మృతి చెందిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకొని పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*