Home / News / Crime / ముద్దివ్వబోతే భర్త నాలుక కొరికి..

ముద్దివ్వబోతే భర్త నాలుక కొరికి..

ఆలుమగల ‘ముద్దు’ సరసం కాస్త వికటించి, భర్త నాలుకకే ఎసరు తెచ్చింది. భార్యకు ఇష్టం లేకుండా పెట్టిన ముద్దు చివరకు భర్తను ఆస్పత్రిపాలు చేసింది. సగం తెగిన నాలుకతో ప్రస్తుతం అతగాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన శనివారం ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం… ఔటర్ ఢిల్లీకి చెందిన ఆర్టిస్ట్ కరణ్‌కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. అయితే పెళ్లి అయిన దగ్గర నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

భర్త అందంగా లేడనే కారణంగా భార్య ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ, గొడవ పెట్టుకునేది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమె… శనివారం కూడా భర్తతో ఘర్షణకు దిగింది. అయితే భార్య కోపాన్ని చల్లార్చేందుకు కరణ్… ఆమెకు బలవంతంగా ముద్దుపెట్టాడు. అసలే కోపం మీద ఉన్న భార్యకు భర్త చర్యకు తిక్కరేగింది. అంతే భర్త ముద్దుపెట్టుకుండగా అతగాడి నాలుకను కసితీరా కొరికేసింది. దీంతో కరణ్ నాలుగ సగం మేర తెగిపడింది.

దీంతో కరణ్‌ను కుటుంబసభ్యులు హుటాహుటీన సర్థార్ జంగ్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయితే కరణ్ స్పష్టంగా మాట్లాడేది కష్టమే అని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కరణ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.