తన కోపమె తన శత్రువు!

కోపంలో విచక్షణ కోల్పోతాం! నోటికొచ్చినట్టు మాట్లాడేసి, ప్రేమించిన వ్యక్తుల్ని దూరం చేసుకుంటాం! అంతిమంగా చెడ్డ పేరు తెచ్చుకుంటాం! ఇవన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపించే నష్టాలు. కానీ కోపం వల్ల మనకు కనిపించకుండా, మన శరీరం లోపల కూడా నష్టాలు జరుగుతాయని మీకు తెలుసా?

కోపం వల్ల స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిసాల్‌ అవసరానికి మించి విడుదలవటం వల్ల మెదడు కణాలు న్యూరాన్లు ఎక్కువ మొత్తాల్లో క్యాల్షియమ్‌ను పీల్చుకుంటాయి. ఇలా క్యాల్షియం ఓవర్‌లోడ్‌ అవటం వల్ల కణాలు త్వరితంగా, తరచుగా చనిపోతాయి. ఇలా నుదురు దగ్గర ఉండే కణాలను నష్టపోతూ ఉండడం వల్లే నిర్ణయాలు తీసుకోగలిగే సామర్ధ్యం దెబ్బతింటుంది.

పెరిగిన కార్టిసాల్‌ మెదడు మధ్యలో ఉండే హిప్పోక్యాంపస్‌ను ప్రభావితం చేస్తుంది. దాంతో షార్ట్‌ టర్మ్‌ మెమరీ లాస్‌ సమస్య పెరుగుతుంది. దాంతోపాటు కొత్త జ్ఞాపకాలు నాటుకోవటానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ మార్పు వల్లే ఎవరితోనైనా వాదించేటప్పుడు చెప్పాలనుకున్న మాట టక్కున తట్టదు.

ఎక్కువగా విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ మనల్ని ఆనందంగా ఉంచే సెరటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని కుంటుపరుస్తుంది. సెరటోనిన్‌ హార్మోన్‌ తగ్గితే తేలికగా, త్వరగా ఉద్రేకపడిపోతూ ఉంటాం. ఈ మానసిక స్థితి ఎక్కువ కాలం కొనసాగితే, డిప్రెషన్‌కు కూడా గురవుతాం! కాబట్టి ఈ సమస్యలన్నిటికీ మూల కారణమైన కోపాన్ని అదుపు చేసుకోండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*