అభిమాన నేత నుంచి జననేత వరకు!

జగన్ మొండి వైఖరే ఆ పార్టీ కొంపముంచుతుంది.. ఇది ఆయన వ్యతిరేక వర్గాలు చెప్పే మాట.. లేదు లేదు ఆయన సమర్ధతే పార్టీని ముందుకు నడిపిస్తుంది.. ఇది ఆయన అనుకూల వర్గాలు చెప్పే మాట. జగన్ వి ఒంటెద్దు పోకడలు అంటారు తెలుగు తమ్ముళ్లు కాదు కాదు నాయకత్వ లక్షణాలు అంటారు ఆయన అభిమానులు. జగన్ కి సీఎం పీఠంపై యావ ఎక్కువ అంటారు ప్రత్యర్ధులు… లేనే లేదు తండ్రి మాదిరి ప్రజల గుండెల్లో నిలిచిపోలనే తాపత్రేయం అంటారు అనుచరులు. జగన్ కు ప్రజా సమస్యలు పట్టవు కనుకే అసెంబ్లీ రాడు అంటారు అధికార పార్టీ వారు.. జనం మనిషి కనుకే జనం మధ్యలో ఉంటున్నాడు అంటారు సొంత పార్టీ వారు. ఇలా ఒకటి కాదు ఎన్నో భిన్న వాదనలు మధ్య 10 ఏళ్ళగా జగన్ రాజకీయ ప్రస్థానం సాగుతుంది.

తండ్రి వారసత్వాన్ని తాను కోరుకున్నా.. సోనియా కటాక్షం దక్కకపోవడంతో .. నాన్న పేరుతో కొత్త పార్టీని పెట్టుకునేలా చేసింది.. వైఎస్సార్ కాంగ్రెస్! చెప్పుకోవడానికి ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ నిర్వచనాలు ఇచ్చుకున్నా.. అందులో నాన్న పేరే కనిపిస్తుంది. అన్నీ తానే అయి… ముందుకు దూసుకుపోతున్న మొండితనం అక్కడ కనిపిస్తుంది. ముందునుంచీ జగన్‌లో స్వతంత్రభావాలే ఎక్కువ! ఎవర్నీ అంతగా దగ్గరకు రానివ్వడు.. నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాడు. తమకు అంతగా చనువు ఇవ్వని ఒక నాయకుడి దగ్గర చేరువవ్వడానికి ప్రయత్నించేవాళ్ళే అక్కడెక్కువగా కనిపిస్తారు.నాయకత్వ లక్షణాలు మెండుగా వున్న జగన్ లోపలి అసలు జగన్ ఆలోచనలు ఎలా వుంటాయన్న తహతహలు ఆయన చుట్టూ వుండేవాళ్ళ దగ్గర కనిపిస్తాయి.

మొండితనాలు ఒక్కోసారి గొప్పవే అయినా.. వాటితో బాటు వ్యూహాలు కూడా ముఖ్యమే!మొదట్నుంచీ జగన్ తన తండ్రి అనుచరులనూ.. ఆఖరికి ఆంతరంగీకుడైన కెవిపిని సైతం దూరం పెట్టాడు. వాళ్ళ అవసరాలూ.. అనుభవాలు.. సలహాలు.. సంప్రదింపులూ.. తనకు అవసరం లేదనే స్వతంత్ర స్వభావం జగన్‌ది. ఆ పార్టీలో అన్ని ఆయనే, నెంబర్ వన్ నుంచి నెంబర్ 10 దాకా. ఇంకెవరు కనిపించరు. ఇంకెవరు మాట్లాడారు. అంతా ఆయన చుట్టూనే పరిభ్రమిస్తుంది.  ఇమిడిపోయిన  వాళ్లకు నోళ్లు ఉండవు. నోళ్లు ఉన్న వాళ్లకు పదవులు ఉండవు. ఎందుకు ఇలాంటి పరిస్థితో అర్ధం కాదు.

తండ్రి హావభావాల్ని బాగానే పుణికి పుచ్చుకున్న జగన్.. పాదయాత్రలకొస్తున్న జనం.. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళా.. లేక తరలించుకొచ్చినవాళ్ళా.. ఎవరైతేనేం.. అవి మాత్రం కిక్కిరిసిపోతున్నాయి.. సక్సెస్‌లుగా మారుతున్నాయి. జగన్ తనదైన శైలిని ఈ పాదయాత్రలో ప్రవేశ పెట్టుకున్నట్లే కనిపిస్తుంది. అన్నీ తానే అయి… ముందుకు దూసుకుపోతున్న మొండితనం అక్కడ కనిపిస్తుంది.అయితే ఇసుకు వేస్తే రాలనంత జనం..  తన పేపర్లో పట్టనంత పెద్ద సైజు ఫోటోలు, టీవిలో గంటల గంటల నీరివి గల ప్రసారాలు. సంవత్సరాలు తరబడి సాగిపోయిన ఓదార్పు యాత్రలు ఎందుకు 2014 లో ఫలితాలు ఇవ్వలేదు అన్నదే ఆయనే గుండెలమీద చెయ్యి వేసి చెప్పుకోవాల్సిందే.

అయిదు లక్షల ఓట్లు.. ఆ అయిదు లక్షల ఓట్లే ఓడలను బండ్లు చేశాయన్నది జగన్ మాట. తెలుగుదేశం కంటే తక్కువైనా ఆ అయిదు లక్షల ఓట్లే తన పుట్టి ముంచింది అన్నది ఈ జగన్ జీర్ణించుకోలేని చేదు నిజం.కాకపోతే జగన్ వైఖరి, వ్యూహం, మొండితనాల వంటి లక్షణాలు కూడా అతని ఎదుగుదలకు ఆటంకాలు!.. పార్టీ నిర్మాణం – ఎన్నికల వ్యూహాలను సానబెట్టే కార్యక్రమాలు రూపొందించుకోవాలి. అవతల వున్నది అపరచాణక్యుడు చంద్రబాబు. ఆ తర్వాత తన బలం నిరూపించుకోవడానికి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. ఇక ఈసారి తమ సంప్రదాయ ఓటు బ్యాంక్‌తో ఎంతోకొంత సంపాదించుకోవాలన్న యావతో వున్న కాంగ్రెస్ పార్టీ..! ఇప్పటికిప్పుడైతే బ్యాలెట్ మిషన్ మీద ఫింగర్ ప్రింట్స్ కాస్త కన్‌ఫ్యూజింగ్.. ఈ కొద్దీకాలంలో ఏదైనా జరగొచ్చు.. ఎలక్షన్స్‌కు ఇంకా టైముంది. మరి నాన్న చెప్పుల్లో జగన్ కాళ్ళు పెడతారా లేదా గుండెలమీద చేతులు వేసుకుంటే పోయేది ఏమిలేదు ఒక్క భయం తప్పా!.

జగన్ దగ్గర.. 2019 ఎన్నికల కోసం.. 12 ఏళ్ళ రాజకీయ అనుభవం వుంది. 2014 మిగిల్చిన ఎన్నికల ఎక్స్‌పీరియన్స్ వుంది. అప్పుడు జరిగిపోయిన అభ్యర్థుల ఎంపికలు, తప్పొప్పులూ.. వాటి నుంచి నేర్చుకున్న అనుభవాలూ వున్నాయి. ఇవీ.. అతనికున్న ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్! అంతేకాదు.. తన ప్రత్యర్థి చంద్రబాబు చేసిన రాజకీయ ఎత్తుగడలు.. వేసిన పాచికలన్నీ.. జగన్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. నో డౌట్.. అవన్నీ అతనికి 2019లో బాగా వుపయోగపడతాయి.అల్ ది బెస్ట్ వైఎస్ జగన్.