కడప గడ్డపై జగన్ అడుగు!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ దాదాపు 14 నెలల తర్వాత సొంత జిల్లా కడపలో అడుగుపెట్టారు. నిన్నతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జగన్ ఈరోజు ఉదయం 8.30 గంటలకు రైల్వే కోడూరుకు చేరుకున్నారు. అక్కడ తన తండ్రి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జగన్ ను చూడగానే అభిమానులు, వైసీపీ కార్యకర్తలు జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జగన్ కు మద్దతుగా అభిమానులు తిరుపతి నుంచి రైల్వేకోడూరు వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. కాగా, జగన్ రాజంపేట మీదుగా తన నియోజకవర్గమైన పులివెందులకు చేరుకోనున్నారు.