జగన్ మనసులో ఏముందో?

గెలుపే లక్ష్యంగా పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇందులో భాగంగా పార్టీలో కీలక నేతలను సైతం పక్కకు పెట్టేస్తున్నారు జగన్. అయితే జగన్ తాజా నిర్ణయం తో వైసీపీ నేతల్లో కొంత భయం మొదైలంది అని చెప్పాలి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో వైసీపీకి మంచి పట్టుంది. అందుకే ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా వై.వి. సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, ప్రాంతాలు వైసిపికి కంచుకోటల్లా మారాయి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో పాటు ఎస్సీ, ముస్లిం జనాభా కూడా వైసిపి వైపు మొగ్గు చూపడంతో వైసీపీ గెలుపు సునాయాసంగా మారింది. అయితే ఇటీవల వచ్చిన సర్వే రిపోర్టులు వైసీపీ పట్టు తగ్గుతున్నటు రావడం.. మరోవైపు వైసీపీ నేతలు కొందరు టీడీపీలో చేరడంతో ఇక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితులున్నాయి అని తేలడంతో జగన్ ఈ ప్రాంతం పై ద్రుష్టి పెట్టారు.

అను నిత్యం ప్రజల్లో ఉండాలని జగన్ ఆదేశాలతో .. ఒంగోలు పరిధిలో ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ..వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నుంచి వెలుగొండ వరకూ యాత్ర చేపట్టారు. మరోవైపు రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్. అయితే అభ్యర్ధిని కూడా మార్చాలన్న ప్రతిపాదనలున్నట్టు తెలుస్తోంది. సుబ్బారెడ్డి కాదంటే.. అంతకంటే బలమైన అభ్యర్ది ఎవరన్న దానిపై పార్టీలో చర్చ జరిగింది. అయితే వైఎస్ షర్మిల సరైన అస్త్రం అవుతారని కేడర్ చెబుతోంది. బాబాయిని కాకుండా… ఈసారికి అమ్మాయిని బరిలో దింపితే పార్లమెంట్ తో పాటు… అసెంబ్లీ కూడా స్వీప్ చేయవచ్చని అధినేతకు కొందరు నాయకులు సూచించినట్టు తెలుస్తోంది.

షర్మిల అయితే.. బాలినేని వర్గం కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. వైసిపికి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరులతో పాటు కనిగిరి, ఒంగోలు, కొండెపి, దర్శి నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి విజయకేతనం ఎగురవేయవచ్చన్న వ్యూహంలో వైసిపి ఉన్నట్టు తెలుస్తోంది. మరి జగన్ మనసులో ఏముందో? మరికొద్ది రోజులు ఆగితేకాని స్పష్టత రాదు.