‘రాజభవన్’కో రిక్వెస్ట్!

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన విచారణ కుట్రకోణ దిశగా జరగడం లేదని వైఎస్సార్‌పీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించేందుకు వైస్సార్‌సీపీ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు.

అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై దాడి ఘటన అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించామన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గవర్నర్‌ డీజీపీతో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగిన అరగంటలోపే డీజీపీ తన అభిప్రాయాన్ని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం, డీజీపీల తీరును గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. హత్యాయత్నం వెనుక కుట్రదారులు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. హత్యాయత్న ఘటనపై థర్డ్‌ పార్టీతో విచారణ చేయాలని గవర్నర్‌ను కోరామని ధర్మాన తెలిపారు.