Mana Aksharam
Entertainment Homepage-Slider Reviews

కథానాయకుడు రివ్యూ

ntr biopic review and rating

ఒక సామాన్యుడు వెండితెరపై విశ్వవిఖ్యాతనటసార్వభౌముడు ఎలా అయ్యాడన్న కథే ఈ ‘కథానాయకుడు’ సినిమా.

రామారావు అనే మధ్యతరగతి ఉద్యోగి ఒక సబ్ రిజిస్ట్రార్‌గా పని చేయడంతో సినిమా మెదలవుతుంది. బసవరామతారకంతో ఆయన అనుబంధం, దాంపత్యంలో అన్యోన్యత ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కథ మద్రాసు చేరుతుంది.

తమ్ముడు త్రివిక్రమరావు, రూమ్మేట్లతో జీవితం, సినిమా రంగంలో తొలి అడుగులు, తడబాట్లు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు.

దక్షిణాదిన సినిమా రంగానికి పునాది వేసిన వారిలో ప్రఖ్యాత దర్శకుడు, తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద నిర్మాత హెచ్.ఎం. రెడ్డిగా సత్యనారాయణను చాలా రోజుల తర్వాత చూస్తాం. నాగిరెడ్డి-చక్రపాణిల పరిచయం, కె.వి.రెడ్డి ‘పాతాళ భైరవి’తో ధృవతారగా ఎదిగే క్రమం అన్నీ ఆసక్తికరంగా చిత్రీకరించారు. అందరు మహామహుల పాత్రలకు తగ్గ నటులే దొరికినా, యాజ్ య్యూజువల్‌గా ప్రకాష్ రాజ్’నాగిరెడ్డి’గారి పాత్రలో మరిపించాడు.

కథ, కథనం, సాంకేతిక అంశాలు

‘మహానటి’లోని డ్రామా ఈ సినిమాలో లేదు. కానీ రెండో సగంలో కథలో కాస్త చలనం కలగడమే కాకుండా, అక్కడక్కడా కదిలించే సన్నివేశాలు పడ్డాయి.

రెండో ఇన్నింగ్స్‌లో అడవిరాముడుతో మొదలుపెట్టి, వేటగాడు పాట, యమగోల డైలాగు, కొండవీటి సింహం మేకప్పు, బొబ్బిలిపులి క్లైమాక్స్ సన్నివేశం ఇలా బాగానే వాడుకున్నారు.

సర్దార్ పాపారాయుడి షూటింగ్ సన్నివేశం నుంచి, న్యూ ఎమ్యెల్యే క్వార్టర్స్‌లో పార్టీ ప్రకటన వరకూ సన్నివేశాలు చకచకా పరిగెడతాయి, ఆసక్తికరంగానూ ఉంటాయి.

సాయిమాధవ్ బుర్రా సంభాషణలు కథకు తగినట్లుగా ఉంటూనే అక్కడక్కడా పటాకుల్లా పేలి హాస్యం పండించాయి.

వెలుగునీడలను కెమెరామెన్ జ్ఞానశేఖర్ బాగా ఉపయోగించుకున్నాడు. కొన్ని సన్నివేశాలు నటుల ప్రతిభ కన్నా కెమెరా పనితనంతో వెలుగులీనాయి.

కీరవాణి నేపథ్య సంగీతం ఫరవాలేదనిపించింది. పాటలన్నీ ఓ వైపైతే, ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!’ అన్న పల్లవి మాత్రం రక్తం ఉరకలెత్తించింది.

తెలుగువారి ఆత్మగౌరవం కారణం చూపుతూ రాజకీయ ప్రవేశం, భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా పదవీస్వీకార కార్యక్రమానికి హాజరవడం, నాదెండ్లతో పరిచయం, పార్టీ ప్రకటనతో ‘మహానాయకుడి’కి నాంది పలుకుతూ ‘కథానాయకుడు’ సినిమా ముగుస్తుంది.

చివరగా

ఎన్టీఆర్ జీవితం ఓ తెరిచిన పుస్తకమే అయినా, కొన్ని సంఘటనలను కథాక్రమం కోసం ఎన్నుకున్నట్లు గమనించవచ్చు. కథానాయకుడి సినిమాలో మనకు తెలిసిన కథను నిజాయితీగానే చూపించే ప్రయత్నం చేసారు.

సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెళితే నిరాశపడతారు కానీ, ఎన్టీఆర్‌ను అభిమానించేవారికి మాత్రం నచ్చే సినిమానే అవుతుంది.

Related posts

అందంతో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంకా చోప్రా

Manaaksharam

సీఎం చంద్రబాబా నేనా ?

ashok p

చంద్రబాబు చేసింది తప్పా ? ఒప్పా?

ashok p