పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. బిగ్ బాస్ ఫేమ్ సంజనపై ఆయన దాడి చేశారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల సంక్షేమం, వారి రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని.. మహిళలపై ఎలాంటి దాడులనూ బీజేపీ సహించబోదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాచన్నగారి నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఆశిష్‌పై సస్పెన్షన్ వేటు
రెండు రోజుల క్రితం నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశిష్ తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని ఆమె పేర్కొంది. బిల్డింగ్‌పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైదరాబాద్, హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సంజన తెలిపింది. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడివున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది సంజన. ఆశీష్ వేధింపులతో భయభ్రాంతులకు గురై, తప్పించుకున్నామని వెల్లడించింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయని ఆమె స్పష్టం చేసింది. సంజన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశిష్ గౌడ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.