బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ సిప్లిగంజ్

తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ లో విజేతగా నిలిచిన శివబాలాజీ ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. ఆ షో కంటే ముందే అతడి పరిస్థితి అంతో ఇంతో నయం అన్నట్లుండేది. కానీ ఈ టైటిల్ గెలిచాక దాన్ని ఏ రకం గానూ ఉపయోగించుకోలేకపోయాడు. కెరీర్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఇక రెండో సీజన్లో బంపర్ క్రేజ్ – ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కౌశల్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ.. అతను కూడా సోదిలో లేకుండా పోయాడు. దీంతో బిగ్ బాస్ ఫాలోయింగ్ – దాని టైటిల్ వల్ల ఏ ప్రయోజనం లేదనే అభిప్రాయం జనాల్లో ఏర్పడింది. కానీ ఈ అభిప్రాయాల్ని బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ మార్చేస్తున్నాడు. బిగ్ బాస్ పాపులారిటీని అతను భలేగా వాడేసుకుంటున్నాడు.పునర్నవితో కలిసి టీవీ షోలో పాల్గొనడం మొదలుకుని షో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి రాహుల్ చాలా బిజీగా ఉంటున్నాడు. వార్తల్లో నిలుస్తున్నాడు. తనను తాను భలేగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ పాపులారిటీకి తగ్గట్లే అతడికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ మధ్యే అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురములోలో ఓ మై గాడ్ డాడీ పాట పాడాడు. సాయిధరమ్ తేజ్ సినిమా ప్రతి రోజూ పండగేలో కూడా ఒక పాట ఆలపించాడు. షో అయ్యాక నెల తిరక్కముందే ఇలా రెండు పెద్ద సినిమాల్లో అవకాశాలందుకుని పాటలు పాడేయడం విశేషమే. తాజా సమాచారం ప్రకారం అతడికి నటుడిగా కూడా ఓ మంచి అవకాశం వచ్చిందట. కృష్ణవంశీ కొత్త సినిమా రంగ మార్తాండలో రాహుల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడట. అందులో ఓ పాట కూడా పాడనున్నాడట. మొత్తానికి బిగ్ బాస్తో రాహుల్ కెరీర్ గొప్ప మలుపు తిరిగినట్లే కనిపిస్తోంది.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*