Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • అక్కడ గందరగోళంలో టీడీపీ : దూసుకుపోతున్న వైసీపీ!
Andhra Editorial Homepage-Slider News Politics

అక్కడ గందరగోళంలో టీడీపీ : దూసుకుపోతున్న వైసీపీ!

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ టీడీపీలో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. తమని పట్టించుకోవడం లేదంటూ ఓ సీనియర్ నేత తిరుగుబావుటా ఎగురవేయడంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. నియోజకవర్గంలో టీడీపీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, వచ్చే ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేయాలని ఇటీవల చంద్రబాబు సమన్వయ కమిటీలో చెప్పి రెండు వారాలైనా కాకముందే అప్పుడే కుమ్మలాటలు మొదలయ్యాయి. అధినేత మాటలు సైతం పెడచెవిని పెట్టి కుమ్మలాటలకు తెరదీయడంతో అక్కడ పరిస్థితిపై తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం ఆవహించింది….

గత నెల 9వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సాలూరు నియోజకవర్గం టీడీపీపై సమావేశంలో విస్త్రుత చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో సాలూరు టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆర్ పి. భంజ్ దేవ్ పేరును చంద్రబాబు ప్రకటించారు. భంజ్ దేవ్ కు అందరూ సహకరిస్తూ వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీ జెండా ఎగుర వేయాలని ఆదేశించారు. ఆ నియోజకవర్గ మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తో పాటు ఇతర నేతలంతా భంజ్ దేవ్ కు సహకరిస్తూ పార్టీని విజయం వైపు తీసుకువెళ్లాలని సూచించారు. సీఎం ఆదేశాలకు సమావేశంలో తలలూపిన నేతలు…జిల్లాలో మాత్రం తమ ధోరణి మార్చుకోలేదు.

వాస్తవానికి ఒకప్పుడు సాలూరు టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఆర్ పి భంజ్ దేవ్ కుల వివాదంలో చిక్కుకొని, అర్థాంతరంగా పదవిని వదిలికోవాల్సి వచ్చింది. 2004 ఎన్నికల్లో గెలిచిన భంజ్ దేవ్ కు వ్యతిరేకంగా అప్పట్లో గిరిజన సంఘాలు ఆయన ఎస్టీ కాదని హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎస్టీ కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో 2006లో ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో రెండో విజేత స్థానంలో ఉన్న నాటి కాంగ్రెస్ నేత పీడిక రాజన్నదొరను ఎమ్మెల్యే పదవి వరించింది. అప్పటి నుంచి రాజన్నదొర సాలూరు నియోజకవర్గంలో తిష్టవేసి, 2014 ఎన్నికల వరకు వరుసగా విజయాలను చేజిక్కించుకుంటున్నారు. మరోపక్క టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న భంజ్ దేవ్ పరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. 2009లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సాలూరులో మరో కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీలో రెండు వర్గాలు తయారయ్యాయి. భంజ్ దేవ్, సంధ్యారాణి వర్గాల మధ్య అప్పటి నుంచి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. గత ఎన్నికల్లో భంజ్ దేవ్ కే టికెట్టు ఇవ్వడంతో అలక వహించిన సంధ్యారాణికి ఇష్టం లేకున్నా అరకు పార్లమెంటు సీటును అంటగట్టారు. అయితే, ఆ ఎన్నికల్లో ఇటు భంజ్ దేవ్, అటు సంధ్యారాణిలు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో అలకతో ఉన్న సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి ఊరడించారు. ఇంత వరకు బాగున్నా, సాలూరు లో మాత్రం నానాటికీ టీడీపీ పరిస్థితిలు దిగజారుతూ వచ్చాయి. వరుస విజయాలతో వైసిపి సాలూరులో పాగా వేసిన పరిస్థితులున్నా, టిడిపి తన పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోతోంది. తాజాగా నియోజక వర్గ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎం ఎల్ సి గుమ్మ డి సంధ్యారాణి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. నేతల మధ్య విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయనే మాట సాలూరులో వినిపిస్తోంది. కలిసి పనిచేయాల్సిన నేతలు తలో దిక్కుగా వ్యవహరించడంతో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు.

పార్టీ క్యాడర్ కు దారి చూపాల్సిన నేతలే తలోదారిగా వ్యవహరిండంతో సాలూరు టిడిపిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాలపై అధిష్టానం ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాలి.

Related posts

రాష్ట్రపతిని కలవనున్న వైకాపా ఎంపీలు ..

ashok p

అమరావతిలో వాస్తు పేరుతో ‘దోపిడీ’!

ashok p

‘రావాలి జగన్… కావాలి జగన్’.. దుమ్మురేపుతున్న వైసీపీ సాంగ్

Manaaksharam