Mana Aksharam
  • Home
  • News
  • National
  • ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం
Editorial Headlines National News

ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం

భారతదేశపు ఉక్కు మనిషి అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు ఒక్కటే అదే సర్దార్ వల్లభాయ్ పటేల్. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 565 సంస్థానాలను తిరిగి భారతదేశంలో విలీనం చేసి దేశ సమైక్యతా సారథిగా దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు తగిన గౌరవం ఇచ్చేందుకు నర్మదా నదీ తీరాన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో నిర్మించడం జరిగింది.

ఇక పటేల్ విగ్రహ నిర్మాణానికి వస్తే.. పటేల్‌ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. అక్కడ నివసించే స్థానికులకు ఇబ్బంది లేకుండా, సందర్శకులు ప్రశాంతంగా చూసేలా ఏర్పాటు చేశారు. కాంస్యంతో నిర్మించడం వల్ల చూడటానికి అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.

కాగా, విగ్రహం ఛాతి వరకు వెళ్లి పరిసరాలను చూసేలా లోపలి నుంచి రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. కాంక్రీట్‌తో నిర్మించిన రెండు కాళ్ల లోపలి నుంచి ఈ రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. వాటిద్వారా 157 మీటర్ల ఎత్తు వరకూ సందర్శకులు వెళ్లవచ్చు. అంటే పటేల్‌ ఛాతి దగ్గర నుంచి ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది.

రోడ్డు, రైలు అనుసంధానంతో మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. విగ్రహం ఉన్న సాధు ఐలాండ్‌ను వంతెన నిర్మించి హైవేతో కలిపారు. గిరిజనుల అభివృద్ధికి ఇక్కడ పాఠశాలలు, విశ్వవిద్యాలయం ఏర్పాటవుతాయని ప్రభుత్వం తెలిపింది. మెమోరియల్‌, సందర్శకుల కేంద్రం, విద్యా పరిశోధనా కేంద్రం, నాలెడ్జ్‌ సిటీ, గరుడేశ్వర్‌ నుంచి బద్‌బుత్‌ వరకూ పర్యాటక కారిడార్‌, క్లీన్‌ టెక్నాలజీ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ శిక్షణా కేంద్రం రూపుదిద్దుకున్నాయి.

సర్దార్‌ సరోవర్‌ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అది ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్‌ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. 1210 మీటర్ల పొడవైన కాంక్రీట్‌ గ్రావిటీ డ్యాం ఇది. 121 మీటర్ల ఎత్తున ఉంది. విగ్రహం నుంచి చూస్తే డ్యాం అందాలు కనువిందు చేస్తాయి.

పటేల్‌ విగ్రహం ఏర్పాటుకు గుజరాత్‌ ప్రభుత్వం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ రాష్ట్రీయ ఏక్తా ట్రస్టును (ఎస్‌వీపీఆర్‌ఈటీ) ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి గల అవకాశాలను అధ్యయనం చేసింది. 2010లో విగ్రహం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. అప్పటికే ఏర్పాటై ఉన్న సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగం లిమిటెడ్‌ ఇందులో పాలుపంచుకుంది.

విగ్రహం ఎత్తు: 182 మీటర్లు (సుమారు 597 అడుగులు) నిర్మాణ ప్రదేశం: సాధు బెట్‌ ఐలాండ్‌. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరం. వింధ్యాచల్‌, సాత్పూర పర్వత సానువుల మధ్య. వ్యయం: రూ.2,989 కోట్లు. ప్రాజెక్టు మొత్తం పరిధి 19,700 చదరపు మీటర్లు. నిర్మాణంలో 1700 టన్నుల కాంస్యం, 1,80,000 క్యూబిక్‌ మీటర్ల సిమెంటు, 18,500 టన్నుల స్టీల్‌ కాంక్రీట్‌లో కలిపి, 6500 టన్నుల స్టీల్‌ విడిగా స్ట్రక్చర్‌ కోసం వాడారు.

స్టాచూ ఆఫ్ లిబర్టీ కంటే సర్దార్ విగ్రహం రెండింతలు పొడవైనది కావడం గమనార్హం. ఒక మనిషి 5.6 అడుగులు ఉన్నాడనుకుంటే అలాంటి 100 మంది వ్యక్తులను నిలువుగా ఒకరిపై ఒకరిని నిలిపితే ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తున విగ్రహం ఉంటుంది. విగ్రహం ఛాతీ వరకూ రెండు లిఫ్ట్‌ల్లో సందర్శకులు వెళ్లవచ్చు. ఆ ప్రాంతంలో ఒకేసారి 200 మంది నిలుచుని పరిసరాలను వీక్షించవచ్చు. విగ్రహం గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు. 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ తట్టుకుని నిలవగలదు. విగ్రహాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి. 320 మీటర్ల పొడవైన వంతెన లేదంటే పడవల్లోనూ చేరుకోవచ్చు.

కాగా, 3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు ఈ నిర్మాణం కోసం పని చేశారు. ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 26 మంది వెళ్లవచ్చు. కేవలం అరనిమిషంలో లిఫ్ట్‌ 500 అడుగులు వెళ్తుంది. మొత్తం 3వేల పటేల్‌ ఫొటోలను పరిశీలించి విగ్రహానికి రూపునిచ్చారు. 1949లో తీసిన ఫొటో ప్రధాన పాత్ర వహించింది. మొదట సుతార్‌ 18 అడుగుల కాంస్య విగ్రహం తయారు చేశారు. పటేల్‌ను నిజజీవితంలో చూసిన వారిని అడిగి వివరాలను తెలుసుకున్నారు.

ఈ విగ్రహాన్ని నాలుగు అంచెల్లో నిర్మాణం చేశారు. త్రీ డైమెన్షనల్‌ స్కానింగ్‌ టెక్నిక్‌, కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ ప్రొడక్షన్‌ టెక్నిక్‌లను ఉపయోగించారు. టర్నర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రధాన నిర్మాణదారుగా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంది. దానికి మెయిన్‌హార్డ్‌, మైఖేల్‌ గ్రేవ్స్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలు సహకరించాయి. స్ట్రక్చర్‌ డిజైన్‌, ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కాంక్రీట్‌ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపట్టింది.విగ్రహ నిర్మాణం కోసం దేశంలోని లక్షా అరవైతొమ్మిది వేల గ్రామాల నుంచి ఇనుమును సేకరించారు.

ఇక్కడ పర్యాటకుల కోసం అనేక ఏర్పాట్లు కూడా చేశారు. పర్యాటకుల విడిది, విశ్రాంతి, ఆహారం కోసం శ్రేష్ఠ భారత్‌ భవన్‌, పటేల్‌ జీవిత విశేషాలతో మ్యూజియం, పరిశోధనా కేంద్రం ఏర్పాటవుతున్నాయి. శ్రేష్ఠ భారత్‌ భవన్‌ త్రీస్టార్‌ హోటల్‌గా ఉంటుంది. అక్కడ పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. సభలు, సమావేశాలకు అనువుగా ఉంటుంది. దీని నిర్మాణం పర్యావరణానికి అనువుగా ఉంటుంది. లేజర్‌ సౌండ్‌, లైట్‌ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. పరిశోధనా కేంద్రంలో వ్యవసాయాభివృద్ధి ప్రణాళికలు, నీటి నిర్వహణ, గిరిజనుల అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతాయి. ఇంకా రెస్టారెంట్లు, సేదతీరే కేంద్రాలతో విగ్రహం ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. తద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది ప్రభుత్వ లక్ష్యం.

మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3001 కోట్లుగా మొదట కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు విధానంలో చేపట్టేందుకు నిర్ణయించి టెండర్లు ఆహ్వానించడంతో రూ.2989 కోట్లకే చేపట్టేందుకు ఎల్‌అండ్‌టీ కన్సార్షియం ముందుకొచ్చింది. విగ్రహం నిర్మాణానికి: 1347 కోట్లు ఎగ్జిబిషన్‌ హాలు, కన్వెన్షన్‌ సెంటరుకు: 235 కోట్లు నది నుంచి విగ్రహం వరకూ వంతెనకు: 83 కోట్లు 15ఏళ్లపాటు నిర్వహణ వ్యయం: 657 కోట్లు గుజరాత్‌ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చింది: 800 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది: 300 కోట్లు. మిగితా నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కేటాయించే అవకాశం ఉంది.

Related posts

ఆంధ్రాలో హిట్లర్ పాలన!

ashok p

చంద్రులిద్దరి పై చంద్రగ్రహణ ప్రభావం!

ashok p

మాజీ సీఎంను అరెస్టు చేసే అవకాశం?

ashok p