సైరా రివ్యూ ..చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ కేక..

సైరా రివ్యూ ..చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ కేక..

ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ తెలుగు ఆడియెన్స్‌ ఎదురుచూస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిని ఎదురించిన తొలి వీరుడిగాధను సైరా నరసింహారెడ్డి కథ ద్వారా మనకు తెలియజేయాలన్నది చిరంజీవి కల. ఇప్పుడు ఆ కలను సాకారం చేశారు ఆయన కొడుకు రామ్ చరణ్. అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి(అనుష్క శెట్టి) బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు తనకు స్ఫూర్తిగా నిలిచిన మరోవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(చిరంజీవి) కథను గుర్తుకుచేసుకునే క్రమంలో ఈ సినిమా కథ సాగుతోంది. రాయలసీమ ప్రాంతంలో పాలేగారు అయిన నరసింహారెడ్డి దేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ వారంటే అస్సలు పడదు. తమభూములకు సిస్తులు కట్టే క్రమంలో ఒకసారి కరువు తీవ్రంగా వాటిల్లుతుంది. దీంతో ప్రజలు సిస్తు కట్టలేకపోతారు. ఈ క్రమంలో బ్రిటిష్ వారి ఆగడాలను ఎదురిస్తాడు నరసింహారెడ్డి. తనతోపాటు మిగతా పాలేగాళ్లను కలుపుకుని బ్రిటిష్ వారిని ఎదురిస్తాడు నరసింహారెడ్డి. ఆయన భార్య సిద్దమ్మ(నయనతార) తన భర్త పోరాటంలో గెలవాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని నరసింహారెడ్డి ఎదురించడంలో ఆయనకు ఎవరెవరు సాయం చేశారు..? చివరకు నరసింహారెడ్డిని బ్రిటిష్ వారు ఎలా పట్టుకున్నారు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:

సైరా నరసింహారెడ్డి చిత్రం ఓ స్వాతంత్య్ర సమరయోధుడి గాధ. చరిత్ర మరిచిన వీరుని కథను చిరంజీవి మనకు మరోసారి గుర్తుకు చేశాడు. ఇక సైరా సినిమా విషయానికి వస్తే సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుస్తాయి. భారతదేశ స్వాతంత్ర్యం రాకముందే మన తెలుగువాడు బ్రటిష్ వారిని ఎదురించిన తీరు చూసి ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ వస్తాయి. ఫస్టాఫ్‌లో నరసింహా రెడ్డి పాలేగారుగా జీవనం సాగించిన విధానాన్ని మనకు చూపించారు. ఈ క్రమంలో ఆయన భార్యతో కలిసి ప్రజలను ఆదుకునే అంశాలు బాగా చూపించారు. ఈ క్రమంలో బ్రిటిష్ ఆగడాలను వ్యతిరేకించే నరసింహారెడ్డి, సీమ కరువుతో అల్లాడుతుంటే ప్రజలను పట్టిపీడించే బ్రిటిష్ వారిని ఎదురిస్తాడు. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇక సెకండాఫ్‌లో నరసింహారెడ్డి తనతో పాటు మరికొంత మంది పాలేగాళ్లను కూడబెట్టుకుని బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడతాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డికి సాయం చేసే పాలగాళ్లు ఎవరనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల బ్రిటిష్ వారికి చిక్కిన నరసింహారెడ్డిని వారు ఏం చేశారనే అంశంతో సినిమా కథను ముగించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాతో తెలుగు చలనచిత్ర సత్తాను మరోసారి చాటిచెప్పారు చిరంజీవి. ఓవరాల్‌గా సైరా నరసింహారెడ్డి చిత్రం ఓ దేశభక్తి సినిమాగా తెలుగు ప్రేక్షకులతో పాటు మిగతా భాషల ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కమర్షియల్ హంగులను పక్కనబెట్టి ఓ దేశభక్తి సినిమాగా సైరా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో విజయం సాధించింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:

సైరా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఉయ్యాలవాడ చిత్రాన్ని తెరకెక్కించాలనే కలను తన కొడుకు రామ్ చరణ్ సాయంతో నెరవేర్చుకున్న చిరు, ఈ సినిమాను ప్రాణం పెట్టి తీశాడు. ముఖ్యంగా ఎమోషనల్, దేశభక్తి సన్నివేశాల్లో ఆయన నటనకు మాటల్లేవు. ఇక చిరు డైలాగ్ డెలివరీకి సీట్లకు అతుక్కుపోయారు జనం. ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న పాత్రల్లో జగపతిబాబు, సాయిచంద్ పాత్రలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా తమ పాత్రలు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ పర్ఫార్మెన్స్:

టెక్నికల్ పరంగా సైరా నరసింహారెడ్డి ఓ విజువల్ ట్రీట్ అని చెప్పాలి. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ పనులు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం పడ్డ కష్టం మొత్తం మనకు తెరపై కనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. ఇంత భారీ తారాగణాన్ని ఆయన హ్యాండిల్ చేసిన విధానం సూపర్. ఇక సినిమాను ఎక్కడా పక్కదారి పట్టకుండా సురేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు సినిమా విజయానికి దోహదపడింది. ఇక రత్నవేలు అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు మరో మేజర్ అసెట్. భారీ సెట్టింగ్స్‌ను అంతే భారీ స్థాయిలో చూపించాడు రత్నవేలు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బాగుంటే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం పెట్టిన భారీ బడ్జెట్ సినిమా మొత్తంలో మనకు కనిపిస్తుంది. అమిత్ త్రివేది సంగీతం అందించిన పాటలు బాగున్నాయి . కానీ బీజీఎం సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే సంగీతం పీక్స్.

చివరగా సైరా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి తన విశ్వరూపాన్ని చూపించాడు

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*